మొక్కజొన్న కొనుగోళ్లకు సర్వం సిద్ధం
సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి క్రైం: సింగిల్ విండోల ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 18 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని యంత్రాంగం నిర్ణయించగా, ఆయా గ్రామాల్లో అధికారులు కేంద్రాలను ప్రారంభించారు. ఎంపిక చేసిన గ్రామాల్లో కేంద్రాల ద్వారా పంట దిగుబడిని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. రైతులు పంట దిగుబడులను కేంద్రాలకు తీసుకురావడమే తరువాయి. జిల్లాలో ఇప్పటికే మొక్కజొన్న పంట చేతికొస్తోంది. కొన్నిచోట్ల కోతలు ప్రారంభమయ్యాయి.
34 వేల ఎకరాల్లో సాగు
ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 34 వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఇది అధికారిక లెక్కల ప్రకారం మాత్రమే. జిల్లాలోని గాంధారి, లింగంపేట, మాచారెడ్డి, బాన్సువాడ, రామారెడ్డి మండలాల పరిధిలో చాలా కాలంగా అటవీ భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయి. అది వేల ఎకరాల్లో ఉంటుంది. అటువంటి భూముల్లో ఎక్కువగగా మొక్కజొన్న పంటనే సాగు చేస్తుంటారు. అనధికారికంగానే దాదాపు 50 వేలకుపైగా ఎకరాల్లో మొక్కజొన్న సాయ్యే అవకాశాలుంటాయి.
సేకరించేది ఇక్కడే..
బాన్సువాడ మండలం హన్మాజీపేట, బిచ్కుంద మండలం పుల్కల్, పెద్ద కొడప్‌గల్, పిట్లం, భిక్కనూర్ మండలం అంతంపల్లి, బస్వాపూర్, మా చారెడ్డి మండలం సోమారంపేట్, రాజంపేట మండలంలోని రాజంపేట, ఆర్గొండ, కొండాపూర్, గాంధారి మండలంలోని గాంధారి, ముదెళ్లి, దుర్గం, సదాశివనగర్ మండలం భూంపల్లి, సదాశివనగర్, తాడ్వాయి మండలంలోని తాడ్వాయి, ఎర్రాపహాడ్, దేమికలాన్ గ్రామాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పరిమితి పెంపు
మొక్కజొన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి కబురు చెప్పింది. మక్క కొనుగోళ్లపై విధించిన పరిమితిని ఎత్తివేసింది. ఇది వరకు ఎకరానికి 18.5 క్వింటాళ్లు మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేయగా, ఇప్పుడు ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు సేకరించేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మంగళవారం సంబంధిత అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. సీలింగ్ కారణంగా పంటను పూర్తిగా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన చెందిన రైతులు ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 18 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రభుత్వం 18.50 క్వింటాళ్ల సేకరణ నిబంధనను నిబంధనను సడలించి 25 క్వింటాళ్లకు పెంచింది. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలి.
– మహేశ్‌కుమార్, డీఎం, మార్క్‌ఫెడ్, కామారెడ్డి
జిల్లాలో 18 కేంద్రాలు ప్రారంభం
ప్రస్తుత సీజన్‌లో 34 వేల
ఎకరాల్లో మొక్కజొన్న సాగు
సేకరణ పరిమితి పెంపుతో
రైతుల ఆనందం
ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు
కొనుగోలు


