
పరీక్షల వేళ శిక్షణ
పరీక్షల సమయంలో..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా విద్యాశాఖ అధికారుల అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, శిక్షణ, సమావేశాల పేరుతో చాలా స్కూళ్లలో బోధన కుంటుపడింది. సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ)–1 పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం అవుతుండగా, చాలా చోట్ల ఆయా సబ్జెక్టులకు సంబంధించి పోర్షన్ పూర్తి కాలేదు. ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు ఎస్‌ఏ–1 పరీక్షలు కొనసాగనున్నాయి. అయితే పరీక్షలు ప్రారంభం కానున్న శుక్రవారం రోజు నుంచే ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ టీచర్లకు ఎక్స్‌పరిమెంటల్ లర్నింగ్ మెథడాలజీస్‌పై ఐదు రోజుల శిక్షణ ఏర్పాటు చేశారు. సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఓ కార్పొరేట్ సంస్థ ఆర్థిక సహకారంతో ఈ నెల 24 నుంచి ఐదు రోజులపాటు జిల్లా కేంద్రంలో శిక్షణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. శిక్షణకు హాజరయ్యే ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అది కూడా ఓ కార్పొరేట్ సంస్థ ఆర్థిక సాయంతో ప్రైవేట్ కాలేజీలో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆఖరుకు ట్రైనింగ్‌కు హాజరయ్యే ఉపాధ్యాయులకు వారే లంచ్ ఏర్పాట్లు చేసుకోవాలంటూ మెసేజ్‌లు చేశారు. మరి కార్పొరేట్ సంస్థ ఇచ్చే ఆర్థిక సాయం ఎవరి జేబుల్లోకి వెళుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
కలెక్టర్ దృష్టి సారిస్తేనే..
జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన డిప్యుటేషన్లతో జిల్లా విద్యాశాఖ చేస్తున్న అవినీతి గురించి ఉపాధ్యాయులు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో ఉండే చాలా మంది ఉపాధ్యాయులు ప్రమోషన్లు, బదిలీలల్లో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, పిట్లం, జుక్కల్ తదితర మండలాలకు వెళ్లారు. సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో చాలా మంది టీచర్లు కార్లలోనే ప్రయాణం చేస్తుంటారు. కారుకు అయ్యే ఖర్చు వేలల్లో ఉంటోంది. విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పుకుని జిల్లా కేంద్రానికి సమీపంలోని బడులకు డిప్యుటేషన్‌పై వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అధికారులు డబ్బులకు కక్కుర్తిపడి అక్రమ డిప్యుటేషన్లకు తెరలేపారు. ఈ విషయంలో కలెక్టర్ క్షేత్ర స్థాయిలో విచారణ జరిపితే ఎన్నో అక్రమాలు వెలుగు చూస్తాయని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. పరీక్షల సమయంలో శిక్షణలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో అధికారులకే తెలియాలి.
విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే సమయంలో సంబంధిత సబ్జెక్టు టీచర్లు శిక్షణకు వెళ్తే పరీక్షలు ఎవరు నిర్వహించాలో విద్యాశాఖ అధికారులకే తెలియాలి. చాలా స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లు లేక బోధన సరిగా సాగడం లేదు. ఉన్న చోట ఉపాధ్యాయులకు రకరకాల పనులు నెత్తిన పెట్టడంతో పోర్షన్ పూర్తి కావడం లేదు. కనీసం పరీక్షలు ఉంటాయన్న సోయి లేకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సిన ఉపాధ్యాయుడే ట్రైనింగ్‌కు వెళితే ఎవరు నిర్వహించాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు మంచి బోధన అందించాలని ప్రభుత్వాలు కొత్త కొత్త పథకాలకు శ్రీకారం చుడుతుంటే విద్యాశాఖ అధికారులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పిల్లలకు పాఠాలు బోధించే పరిస్థితులు లేకపోగా, పరీక్షల సమయంలోనైనా టీచర్లు బడుల్లో ఉండకుండా ట్రైనింగ్‌ల పేరుతో వారిని పంపించడం తగదని పలువురు పేర్కొంటున్నారు.
రేపటి నుంచే ఎస్‌ఏ – 1 పరీక్షలు
ఇదే సమయంలో ఉపాధ్యాయులకు
శిక్షణా కార్యక్రమాలు
జిల్లా విద్యాశాఖ
అనాలోచిత నిర్ణయాలు
విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు