
ఆభరణాల కోసమే వృద్ధురాలి హత్య
● అంకోల్‌తండా హత్య కేసును
ఛేదించిన పోలీసులు
● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్‌చంద్ర
కామారెడ్డి క్రైం: నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండాలో రెండు రోజుల క్రితం జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్‌చంద్ర వివరాలు వెల్లడించారు. తండాకు చెందిన రాధీబాయి (67)కి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారంతా పెళ్లిళ్లు చేసుకుని ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. రాధీబాయి తన ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఎదురు ఇంట్లో ఉండే సవాయిసింగ్ చాలా రోజులుగా మద్యం, పేకాట, ఇతర వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడ్డాడు. గతంలో అతనిపై పలు దొంగతనం కేసులు ఉన్నాయి. ఈ నెల 20న ఇంట్లో ఒంటరిగా ఉన్న రాధీబాయిపై సవాయి సింగ్ గొడ్డలి కామతో దాడి చేసి, గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న 30 తులాల వెండి ఆభరణాలు తీసుకుని పరారయ్యే క్రమంలో పక్క ఇంట్లో ఉండే లక్ష్మీబాయి చూసింది. మృతురాలి చిన్న కొడుకు లాల్‌సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం నిందితుడిని పట్టుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిని తక్కువ సమయంలో పట్టుకున్న బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్సై రాఘవేంద్ర, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.