నేరస్తులకు ముకుతాడు! | - | Sakshi
Sakshi News home page

నేరస్తులకు ముకుతాడు!

Oct 22 2025 7:18 AM | Updated on Oct 22 2025 7:18 AM

నేరస్

నేరస్తులకు ముకుతాడు!

నేరస్తులకు ముకుతాడు!

తరచూ నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు

మూడు నెలల్లో ఎనిమిది మందిపై

పీడీ యాక్టు

నేరాల నియంత్రణకు

పోలీసుల చర్యలు

నేరం చేసి అరెస్టయి బెయిల్‌పై విడుదలైన కొందరు నేరప్రవృత్తిని మార్చుకోవడం లేదు. జైళ్లకు వెళ్లినా వారు మారడం లేదు. అక్కడ పరిచయమయ్యే నేరస్తులతో కలిసి మరిన్ని నేరాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిని కట్టడి చేయడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ఒక్కోసారి చిన్న ఆధారం దొరక్క నేరస్తులను పట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పదేపదే నేరాలకు పాల్పడుతున్న వారికి ముకుతాడు వేసేందుకు జిల్లా పోలీసు శాఖ పీడీ యాక్ట్‌ (ప్రివెంటివ్‌ డిటెక్షన్‌)ను ప్రయోగిస్తోంది. వారిపై పీడీ యాక్టు నమోదు చేయడం మూలంగా త్వరగా బెయిల్‌ దొరక్క ఎక్కువ రోజులు జైలులోనే గడపాల్సి ఉంటుంది. అందుకే పోలీసు ఉన్నతాధికారులు పీడీ యాక్టుకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా దారిదోపిడీలు, దొంగతనాల వంటి కేసుల్లో చిక్కిన వారిపై పీడీ యాక్టు ప్రయోగించి ముకుతాడు వేసే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో మూడు నెలల కాలంలో ఎనిమిది మంది నేరస్తులపై పీడీ యాక్టు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. ఇందులో అంతర్‌ జిల్లా, అంతర్రాష్ట్ర దొంగలు ఉన్నారు. జిల్లాకు చెందిన వారు ఒకరిద్దరు ఉండగా, మిగతావారు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందినవారున్నారు.

జిల్లాలోని లింగంపేట మండలం కన్నాపూర్‌ గ్రామానికి చెందిన గారబోయిన శ్రీకాంత్‌ (29) అంతర్‌జిల్లా దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతూ పలుమార్లు పోలీసుకు చిక్కాడు. లింగంపేటలో అమ్ముల లక్ష్మి అనే మహిళను చంపి ఆభరణాలను ఎత్తుకెళ్లిన కేసులో అరెస్టయ్యాడు. దీంతో కలెక్టర్‌ అనుమతి తీసుకుని పోలీసు శాఖ గత సెప్టెంబర్‌లో శ్రీకాంత్‌పై పీడీ యాక్టు నమోదు చేసింది. జైల్లో ఉన్న సదరు నేరస్తుడికి పీడీ యాక్టు నమోదు పత్రాలు అందించారు. అలాగే జాతీయ రహదారులపై దొంగతనాలు, దారిదోపిడీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాపై పీడీ యాక్ట్‌ అమలు చేశారు. కామారెడ్డి, నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో రహదారులపై వాహనదారులను లక్ష్యంగా చేసుకుని మారణాయుధాలతో దాడులు చేసి దారిదోపిడీలకు పాల్పడ్డారు. అలాగే ఇళ్లలో దొంగతనాలు, ఇంట్లో ఉన్నవారిపై దాడులు చేసిన కర్ణాటకలోని బీదర్‌ జిల్లా ఔరాద్‌కు చెందిన కృష్ణబాబు షిండే (25), మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా మంగ్యాల్‌ తడాకు చెందిన నామ్‌దేవ్‌ (28), వసూర్‌కు చెందిన రాథోడ్‌ అజిత్‌ రమేశ్‌ (21)పై ఇతర ప్రాంతాల్లో హత్య, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. వీరిద్దరు దారిదోపిడీ కేసుల్లో నిజామాబాద్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు. జూలై 25న వీరిపై పీడీ యాక్టు నమోదు చేశారు. అలాగే దారి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర పార్థీ ముఠా సభ్యులు నలుగురిపై పీడీ యాక్టు నమోదైంది. మహారాష్ట్రలోని వార్దా జిల్లాకు చెందిన చోండా అలియాస్‌ కూలీ పవార్‌ (30), జాకీ గుజ్జియా బోస్లే (27), హరీశ్‌పవార్‌ (18), అనురాగ్‌ రత్నప్ప బోస్లే (50)పై జూలై 7న పీడీ యాక్టు నమోదైంది. వీరు కామారెడ్డి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో తొమ్మిది దారిదోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డారు. రోడ్డుపై ఆగి ఉన్న వాహనాలపై దాడి చేసి ఆయుధాలతో బెదిరించి డబ్బులు, మొబైల్స్‌, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డారు.

పదేపదే నేరాలకు పాల్పడుతూ సమాజంలో శాంతి, భద్రతలకు విఘాతం కలిగించే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నాం. పీడీ యాక్టు నమోదైన వారు జైలు జీవితానికే పరిమితం కావాల్సి ఉంటుంది. తరచూ నేరాలకు పాల్పడే వారు సమాజంలో భయాందోళనలు కలిగిస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

– రాజేశ్‌ చంద్ర, ఎస్పీ

నేరస్తులకు ముకుతాడు!1
1/1

నేరస్తులకు ముకుతాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement