
కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలి
మాట్లాడుతున్న భూపాల్
కామారెడ్డి టౌన్: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో చాలా ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని తక్షణమే క్రమబద్ధీకరణ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు భూపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన యూనియన్ జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు చేపడుతున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పేస్కేల్ వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైద్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. జీజీహెచ్‌లో తొలగించిన ఆరోగ్యశ్రీ ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలన్నారు. నవంబర్ 9న సంగారెడ్డిలో జరిగే యూనియన్ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం యూనియన్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా చంద్రశేఖర్, అధ్యక్షురాలుగా జ్యోత్స్నదేవి, కార్యదర్శిగా అల్లాఉద్దీన్‌తోపాటు పలువురిని ఎన్నుకున్నారు. నాయకులు బాబు, సావిత్రి, స్వామి, గంగాధర్, అన్నపూర్ణ, కవిత, సుజాత, కళ్యాణి, అమీనుద్దీన్, వీరేష్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.