
ఆన్‌లైన్‌లో ప్రజాపాలన దరఖాస్తులెక్కడ?
ఉచిత కరెంటు పథకం రావడం లేదు
● అర్హులకు అందని సంక్షేమ పథకాలు
● ఎంపీడీవో కార్యాలయం చుట్టూ చక్కర్లు
● ఆన్‌లైన్‌లో మరోసారి అవకాశం
కల్పించాలని ప్రజల వేడుకోలు
బిచ్కుంద(జుక్కల్): ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు అధికారుల నిర్లక్ష్యంతో అర్హులైన లబ్ధిదారులకు అందని ద్రాక్షలా మారా యి. ఆరు గ్యారంటీల పథకాలు అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. అప్పట్లో ప్రజలు ప్రజాపాలనలో రేషన్ కార్డులు, 200 యూనిట్ కరెంటు ఉచితం, రూ.500 గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు కావాలని దరఖాస్తు పెట్టుకున్నారు. అధికారులు కొన్ని దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో ఆన్‌లైన్‌లో వారి వివరాలు చూపించడం లేదు. అర్హులు పథకాలకు దూరమయ్యారు. లబ్ధిదారులు.. అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది.
జీపీ కార్యదర్శుల నిర్లక్ష్యం..
ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఒక మున్సిపాలిటీలో కలిపి మొత్తం 16,421 దరఖాస్తులు వచ్చాయి. ఆయా జీపీ కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పలు దరఖాస్తులను ఆన్‌లైన్ చేయకుండా వదిలేశారు. మరికొన్నింటికి ఉచిత కరెంటు, గ్యాస్ సిలిండర్‌పై టిక్ చేయకుండా ఆన్‌లైన్ చేయడంతో కొందరికి పథకాలు అందడం లేదు. అర్హులున్నప్పటికి పథకాలు అందడం లేదని ఎంపీడీవో కార్యాలయానికి వస్తున్నా లబ్ధిదారుల వివరాలు ఆన్‌లైన్‌లో కనపడటం లేదు. తమ చేతిలో ఏమి లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి ప్రజా పాలన పెండింగ్ దరఖాస్తులు ఆన్‌లైన్ చేసుకోవడానికి మరో అవకాశం కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ఆరు గ్యారంటీ పథకాల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకుంటే రసీదు కూడా ఇచ్చారు. ఉచిత కరెంటు, గ్యాస్ సిలిండర్ పథకం వర్తించడం లేదు. ఆన్‌లైన్ కాలేదని అధికారులు అంటున్నారు. చాలా సార్లు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ప్రతి నెలా కరెంటు బిల్లు కడుతున్నాను. సిలిండర్ వెయ్యికి కొనుగోలు చేస్తున్నాను.
–షేక్ హుస్సేన్, బిచ్కుంద

ఆన్‌లైన్‌లో ప్రజాపాలన దరఖాస్తులెక్కడ?

ఆన్‌లైన్‌లో ప్రజాపాలన దరఖాస్తులెక్కడ?