
వసతి గృహంలో ఉండాలంటే పని చేయాల్సిందేనా..?
బాన్సువాడ: నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు ఆదివారం వచ్చిందంటే సరదాగా గడపాలనే ఆశ ఉంటుంది. కానీ విద్యార్థుల ఆశలపై వసతి గృహ వార్డెన్లు నీళ్లు చల్లుతున్నారు. అలాంటి ఘటన బీర్కూర్‌లో చోటు చేసుకుంది. బీర్కూర్ బీసీ వసతి గృహంలో నలుగురు విద్యార్థులు చేతిలో పారలు పట్టుకుని గడ్డిని తొలగిస్తున్న దృశ్యం సాక్షి కంట పడింది. విద్యార్థులు పని చేస్తున్న ఫొటోలు దించే క్రమంలో వసతి గృహ సిబ్బంది వెళ్లి విద్యార్థుల చేతుల్లో ఉన్న పారలను తీసుకుని విద్యార్థులను గదుల్లోకి పంపించారు. వసతి గృహాలను పర్యవేక్షించాల్సిన అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో విద్యార్థులు వసతి గృహాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.