
స.హ. చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● జిల్లా అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ
కామారెడ్డి క్రైం: సమాచార హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. పట్టణంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం ఆర్టీఐ–2005 వారోత్సవాల్లో భాగంగా అన్ని జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఆర్టీఐ చట్టాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. చట్టం లక్ష్యాన్ని నెరవేర్చేలా అన్ని కార్యాలయాల పీఐవోలు ప్రజలు అడిగిన సమాచారాన్ని ఎలాంటి దాపరికం లేకుండా నిర్ణీత సమయంలోగా, నిర్ణీత పద్ధతిలో అందించాలన్నారు. అనంతరం ఆర్టీఐ చట్టాన్ని మార్గదర్శకాల ప్రకారం అమలు చేస్తామని అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, డీఆర్‌వో మధుమోహన్, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, ట్రెయినీ కలెక్టర్ రవితేజ, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పీఐవోలు తదితరులు పాల్గొన్నారు.