
క్రైం కార్నర్
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు మృతి
బాల్కొండ: ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన వడ్ల రాములు(48) గ్రామ ఊర చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. రాములు గ్రామంలో వడ్రంగి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అప్పుడప్పుడు మానసిక పరిస్థితి బాగోలేక పోవడంతో ఆందోళనగా తిరిగేవాడు. ఈ క్రమంలో చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. శనివారం నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని ఎస్సై తెలిపారు.
ఖలీల్‌వాడి: చోరీ కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. మంచిర్యాలకు చెందిన పాత నేరస్తుడు షేక్ యూనుస్ మేడ్చల్ రైల్వేస్టేషన్‌లో ఉన్నట్లు వచ్చిన సమాచారంతో శుక్రవారం అక్కడికి వెళ్లి అరెస్టు చేశామన్నారు. కృష్ణ, పండరీపూర్ రైలులో నిందితుడు చోరీకి పాల్పడ్డాడన్నారు. నిందితుడి నుంచి రెండు ఫోన్లు, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. అతనిపై రెండు కేసులు ఉన్నట్లు నిర్ధారించి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. రైల్వే ఐడీ పార్టీ పోలీసులు హనుమాన్ గౌడ్, సురేందర్ గురుదాస్ ఉన్నారు.
● ఆస్పత్రిలో చేర్చిన ఎయిర్‌పోర్టు సిబ్బంది
నిజామాబాద్‌అర్బన్: దుబాయి ఎయిర్‌పోర్ట్‌లో నిజామాబాద్ నగరానికి చెందిన సయ్యద్ బాబా (38) అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 3న సయ్యద్ బాబా ముంబై నుంచి సౌదీ అరేబియాలోని అభా నగరానికి వెళుతూ దుబాయ్ ఎయిర్‌పోర్టులో మరో విమానం ఎక్కాల్సి ఉండగా, అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. స్పందించిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది సయ్యద్ బాబాను రషీద్ హాస్పిటల్‌లో చేర్పించి మానవత్వం చాటారు. అస్వస్థతకు మత్తు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా, అతడిని ఇండియాకు తిరిగి రప్పించాలని భార్య సమీనా బేగం హైదరాబాద్ ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన సీ ఎం ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫో రం ప్రధాన కార్యదర్శి బీఎల్ సురేంద్రనాథ్ వారికి మార్గదర్శనం చేశారు. దుబాయిలో ఉన్న జిల్లావాసులు నయీం, కొట్టాల సత్యం, నారాగౌడ్ రోగి బాగోగులు చూసుకుంటున్నారని కుటుంబసభ్యులు తెలిపారు.

క్రైం కార్నర్