
రూ.లక్షల నిధులు వృథా
మరమ్మతులు చేయిస్తాం
గాంధారి(ఎల్లారెడ్డి): ఎవరైనా వ్యక్తి చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి సరైన స్థలం లేక ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి ప్రతి ఊరిలో వైకుంఠధామాలు నిర్మించింది. అయితే కొన్ని గ్రామాల్లో అనువైన ప్రదేశాల్లో నిర్మించగా.. మరికొన్ని గ్రామాల్లో వాగులు, చెరువులు, కుంటలు, శిఖం భూముల్లో నిర్మించారు. దీంతో వర్షాకాలంలో ఆ వైకుంఠధామాల్లో అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటల్లో నిర్మించిన వైకుంఠధామాలు నీటిలో మునిగిపోగా వాగుల్లో నిర్మించిన వైకుంఠధామాలు వరదలకు ధ్వంసం అయ్యాయి. గాంధారి వాగులో సంగెం రేవు ప్రాంతంలో రూ.లక్షలు వెచ్చించి వైకుంఠధామం నిర్మించారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అంత్యక్రియలకు వచ్చిన వారి సౌకర్యార్థం నిర్మించిన స్నానాల గదులు, విశ్రాంతి గది, మరుగు దొడ్లు వరదలకు కొట్టుకుపోయి ధ్వంసం అయ్యాయి. తిమ్మాపూర్ గ్రామంలో నిర్మించిన వైకుంఠధామంలో ఇప్పటి వరకు గ్రామస్తులు అంత్యక్రియలకు వినియోగించలేదు. గ్రామస్తులెవరైనా మరణిస్తే వారు పూర్వం నుంచి కులాల వారీగా నిర్వహిస్తున్న ప్రాంతంలోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. వేరే గ్రామాల నుంచి వచ్చి గ్రామంలో స్థిరపడిన ఇద్దరు మరణిస్తే వారి అంత్యక్రియలు మాత్రం వైకుంఠదామంలో నిర్వహించారు. కాని వైకుంఠధామంలో నిర్మించిన కంపోస్ట్ షెడ్డు, స్నానాల గదులు, మరుగు దొడ్లు, విశ్రాంతి గది మాత్రం ధ్వంసం అయ్యాయి. ఈదురు గాలులకు వివిధ కారణాలతో రేకులు ఎగిరిపోయాయి. గదులు పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయి వృథాగా ఉన్నాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులో వరద ఉధృతంగా వచ్చింది. దీంతో వైకుంఠధామంలో నిర్మించిన గదులు వరద ఉధృతికి కొట్టుకుపోయి ధ్వంసం అయ్యాయి. వాటికి మరమ్మతులు చేయిస్తాం.
– నాగరాజు, పంచాయతీ కార్యదర్శి, గాంధారి
వాగులో వైకుంఠధామం నిర్మాణం
ఇటీవల వరదలకు కొట్టుకుపోయిన స్నానాల గదులు
తిమ్మాపూర్‌లో ధ్వంసమైన గదులు, ఇప్పటీకీ వినియోగించని గ్రామస్తులు

రూ.లక్షల నిధులు వృథా