
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
కామారెడ్డి టౌన్: జిల్లాలో వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణ కోసం అధికారులు కొనుగోలు కేంద్రాలను అక్టోబర్ ఒకటో తేదీన ప్రారంభించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. ధాన్యం సేకరణపై శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. వానాకాలం సీజన్‌లో 5.99 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలన్నది లక్ష్యమన్నారు. ఇందుకోసం సొసైటీల ఆధ్వర్యంలో 233, ఐకేపీ ఆధ్వర్యంలో 194 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సరిపడా గోనె సంచులతోపాటు తగినన్ని వేయింగ్ మిషన్లు, తేమ నమోదు శాతం తెలిపే మిషన్లు, ప్యాడీ క్లీనర్స్‌ను కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైన అన్ని వసతులు కల్పించాలన్నారు. రైతులకు టోకెన్‌లు ఇచ్చి వడ్లు కొనుగోలు చేయాలని, సేకరించిన ధాన్యాన్ని 24 గంటల్లో రైస్‌మిల్లులకు పంపించాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే 08468–220051 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.