
ముసురేసింది!
వాగుల్లో పెరిగిన ప్రవాహం
● జిల్లా అంతటా జల్లులు
● అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షం
● మరో రెండురోజులు వర్ష సూచన
పెద్ద ఎక్లార సమీపంలో నిండుగా పారుతున్న వాగు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా అంతటా ముసురుపట్టింది. గురువారం ఉదయం నుంచి మొదలైన ముసురు రాత్రి వరకూ కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో గురువారం నాటి అంగడి (వారసంత)కు ముసురు ఆటంకం కలిగించింది. దసరా, బతుకమ్మ పండగల నేపథ్యంలో చాలా గ్రామాల నుంచి పట్టణానికి వచ్చి షాపింగ్ చేసే ప్రజలు ముసురుతో ఇబ్బందిపడ్డారు.
జిల్లాలో దాదాపు నెల రోజులుగా వర్షం కురుస్తోంది. ఒకటి రెండు రోజులపాటు గెరువివ్వడంతో దుకాణాలు, షాపింగ్ మాల్స్ రద్దీగా కనిపించాయి. పండుగ సీజన్ కావడంతో అందరూ దుస్తులు, ఇతర వస్తువుల కొనుగోళ్లకు కోసం పట్టణాలకు రావడంతో రోడ్లన్నీ బిజీగా కనిపించాయి. కానీ గురువారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రోజంతా జల్లులు కురుస్తూనే ఉన్నాయి. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలున్నాయి. రోజూ కురుస్తున్న వర్షాలతో జనం ఇబ్బంది పడుతున్నారు. గతనెల 27, 28, 29 తేదీలలో జిల్లాలో కుంభవృష్టి కురిసింది. దాదాపు జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశాయి. వాగులు పొంగి ప్రవహించాయి. పోచారం, నిజాంసాగర్ ప్రాజెక్టులకు రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది. పోచారం ప్రాజెక్టు ఒక సందర్భంలో కొట్టుకుపోతుందనే పరిస్థితికి చేరింది. జిల్లాలో చాలా రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలకు రాకపోకలు పునరుద్ధరించలేదు. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లింగంపేట మండలం లింగంపల్లి వద్ద వంతెన దెబ్బతినడంతో ఇప్పటికీ బస్సులు తిరగడం లేదు. జిల్లాలోని చాలా గ్రామాలకు వెళ్లే రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి.
నెల రోజులుగా వాగులు నిరాటంకంగా ప్రవహిస్తున్నాయి. అయితే గురువారం మళ్లీ వర్షం కురవడంతో వాగుల్లో ప్రవాహం పెరిగింది. జిల్లా అంతటా వర్షం పడుతుండడంతో వాగులు, ఒర్రెల్లో ప్రవాహం పెరుగుతోంది. సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ మండలంలోని నల్లవాగు మత్తడి అలుగుపైనుంచి నీరు ఉధృతంగా పొంగి పొర్లుతోంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వానలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. బతుకమ్మ పండుగ సమయంలో కురుస్తున్న వర్షాలతో మహిళలు బతుకమ్మ ఆడడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

ముసురేసింది!