రెట్టింపవుతున్న పోటీ...
ఏర్పాట్లు చేశాం
● నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం
● నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
● జిల్లాలో 49 మద్యం దుకాణాలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మద్యం దుకాణాల నిర్వహణ కోసం ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025–27 సంవత్సరానికి గాను శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
జిల్లాలో 49 వైన్‌షాప్‌లు ఉన్నాయి. ఇందులో ఎస్సీలకు ఐదు, ఎస్టీలకు రెండు, గౌడ కులస్తులకు ఏడు కేటాయించారు. మిగిలిన 35 దుకాణాలు జనరల్. గతంలో రూ.2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫీజును ప్రభుత్వం ఈసారి రూ.3 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. దరఖాస్తు రుసుమును పెంచినా.. పోటీ తగ్గే అవకాశాలు లేవని భావిస్తున్నారు. మద్యం వ్యాపారం కలిసి రావడంతో ఈసారి మరింతగా పోటీ ఉండే అవకాశం ఉందంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్న నేపథ్యంలో చాలా మంది మద్యం వ్యాపారంవైపు దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి.
అందరిలోనూ ఆసక్తి...
మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటన జారీ కాకముందునుంచే పలువురు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చాలా మంది గ్రూపులను తయారు చేసుకున్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వ్యాపారాలు చేస్తున్న వారు మద్యం దందాపై ఆసక్తి కనబరుస్తున్నారు. గురువారం నోటిఫికేషన్ వెలువడడంతో మద్యం వ్యాపారులతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు దందాలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వివిధ వ్యాపారాల్లో భాగస్వాములు, స్నేహితులు.. ఇలా కొందరు కలిసి గ్రూపుగా ఏర్పడుతున్నారు. ఐదు నుంచి పది మంది వరకు కలిసి పది నుంచి ఇరవై దుకాణాలకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. కొందరైతే ఇప్పటికే డబ్బులు సర్దుబాటు చేసుకున్నారు. లక్కీ డ్రాలో మద్యం దుకాణం వస్తే రెండేళ్లలో మంచి వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుందన్న భావనతో చాలా మంది మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.
జిల్లాలో మద్యం వ్యాపారం మీద మోజు పెరుగుతోంది. దరఖాస్తు రుసుము ఎంత పెరుగుతున్నా వెనక్కి తగ్గడం లేదు. రెండేళ్లకోసారి జరుగుతున్న టెండర్లలో రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనం. 2021లో 49 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించగా.. 960 దరఖాస్తు లు వచ్చాయి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పట్లో రూ. 19.20 కోట్ల ఆదాయం వచ్చింది. 2023లో దరఖాస్తులు 2,175 కి పెరిగాయి. వీటి ద్వారా దాదాపు రూ. 44 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. మద్యం అమ్మకాలు ఏడాదికేడాది పెరుగుతుండడం, వ్యాపారం ఏ ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతుండడంతో అందరి కన్ను మద్యం వ్యాపారంపైనే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఈ టర్మ్‌లో వచ్చే అవకాశాలున్నాయి. దీంతో వైన్‌షాప్‌లకు ఈసారి తీవ్రమైన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఈసారి దరఖాస్తులు మూడు వేలు దాటవచ్చని భావిస్తున్నారు. గతంలో దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ.3 లక్షలకు పెరిగింది. తద్వారా ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 49 వైన్‌షాప్‌లకు దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. దీనికి సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశాం. కలెక్టరేట్‌లోని ఎకై ్సజ్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తాం. దుకాణాలకు రిజర్వేషన్ల కోసం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నేతృత్వంలో లాటరీ నిర్వహించాం. గెజిట్ నోటిఫికేషన్‌లో వివరాలు వెల్లడిస్తాం.
– హన్మంతరావు, జిల్లా ఎకై ్సజ్ అధికారి, కామారెడ్డి