
రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారు
● మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
● బాన్సువాడలో బతుకమ్మ సంబురాలు
బాన్సువాడ : తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి బతుకమ్మను తొలగించిన సీఎం రేవంత్‌రెడ్డి పదవికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం సాయంత్రం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు వచ్చి వర్షంలో సైతం బతుకమ్మ ఆడారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్‌రెడ్డి, సునీత, టీఎస్‌పీఎస్‌సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్స్ దఫేదార్ శోభ రాజు, తుల ఉమ, బీఆర్‌ఎస్ నాయకులు రాధ, లత, పావని తదితరులు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ తల్లి పాలు తాగి రొమ్మునే గుద్దిన పెద్ద మనిషి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అని విమర్శించారు. ఆ రావణాసురుడికి అంతం తప్పదన్నారు. మోసం చేసిన వ్యక్తికి శిక్ష తప్పదని, ఆయన రేవంత్‌రెడ్డి కాదని, రైఫిల్‌రెడ్డి అని పేర్కొన్నారు. కేసీఆర్‌ను ప్రజలు మనసులో పెట్టుకున్నారన్నారు. ఆయన మళ్లీ రావాలని ప్రజలు కోరుతున్నారన్నారు.
పోచారం లక్ష్మీపుత్రుడు కాదు..
పోచారం శ్రీనివాస్‌రెడ్డి లక్ష్మీపుత్రుడు కాదని అష్టదరిద్రుడని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కేసీఆర్ పోచారంను లక్ష్మీపుత్రుడిగా భావించి అభివృద్ధికి నిధులు ఇస్తే.. అధికారం పోగానే పార్టీ మారిన పోచారానికి ఉప ఎన్నికల్లో ప్రజలే బుద్ధిచెబుతారని పేర్కొన్నారు. త్వరలో బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయమన్నారు. అధికారం లేకున్నా బాన్సువాడలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలకడం ఆడపడుచుల గుండెల్లో కేసీఆర్ ఉన్నారనడానికి సాక్ష్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హన్మంత్ సింధే, జాజాల సురేందర్, జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు ముజీబొద్దీన్, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు అంజిరెడ్డి, జుబేర్, సుశీలరెడ్డి, శ్రీనివాస్‌రావు, గణేష్, చందర్, సాయిబాబా, రమేష్‌యాదవ్, గాండ్ల కృష్ణ, ఉమ మహేష్, శివ, నార్ల రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.