
నిబంధనలు పాటిస్తేనే అనుమతులివ్వాలి
● ఆస్పత్రులను తనిఖీ చేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: ఆస్పత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలు నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే కొత్త ఆస్పత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలు నడిపించాలన్నారు. అనుమతి లేని ఆస్పత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. అర్హత లేని వారు వైద్యం చేస్తే సీజ్ చేయాలని ఆదేశించారు. వైద్యశాఖ అధికారులు క్రమం తప్పకుండా ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేయాలని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర, ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్ విక్టర్, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, డీసీహెచ్‌ఎస్ విజయలక్ష్మి పాల్గొన్నారు.