
మున్సిపల్ అభివృద్ధికి నిధులు మంజూరు
● రోడ్లు, తాగునీరు, డ్రెయినేజీల
అభివృద్ధికి రూ.15 కోట్లు
● హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు, నాయకులు
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసింది. బిచ్కుంద మున్సిపాలిటీగా ఏర్పాటై 5 నెలలు కావస్తోంది. నిధులు లేక ప్రజల సమస్యలు పరిష్కారానికి అధికారులు నానాతంటాలు పడుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(సీడీఎంఏ) దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీడీఎంఏ కార్యాలయం నుంచి అభివృద్ధి కోసం నిధులు మంజూరయ్యాయి. సీసీ, ఇతర రోడ్ల నిర్మాణం కోసం రూ.5 కోట్లు, మున్సిపాలిటీ భవనం నిర్మాణానికి రూ.3 కోట్లు, డ్రైనేజీ కోసం రూ.3.50 కోట్లు, కల్వర్టులు రూ.1.50, షాపింగ్ కాంప్లెక్స్ కోసం రూ.2 కోట్లు మొత్తం రూ.15 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం రూ.కోట్లలో నిధులు మంజూరు కావడంతో ప్రజలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జునప్ప షెట్కార్ ఎమ్మెల్యేకు, అధికారులు కృతజ్ఞతలు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు. రెండవ విడతలో మరో రూ.15 కోట్లు నిధుల కోసం ఎమ్మెల్యే ప్రయత్న చేస్తున్నారని ఆయన తెలిపారు.