
రికార్డుల వరద
ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే 180 టీఎంసీల ఇన్‌ఫ్లో రాగా.. నెల రోజుల వ్యవధిలోనే 166 టీఎంసీల నీరు ఔట్‌ఫ్లో అయ్యింది. నాలుగు దశాబ్దాలలో ఈ స్థాయిలో వరదలు రావడం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొంటున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
ఉమ్మడి జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం 1923లో ప్రారంభమై 1931లో పూర్తయ్యింది. మంజీర నదిపై అచ్చంపేట గ్రామం వద్ద ఈ ప్రాజెక్టు కట్టారు. రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీటితోపాటు బోధన్, నిజామాబాద్ పట్టణాల ప్రజలకు తాగు నీటిని అందించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం అప్పట్లో 1,400 అడుగులు(29.5 టీఎంసీలు). పూడికతో ప్రాజెక్టు సామర్థ్యం తగ్గిపోతూ రావడంతో 1975లో ఎఫ్‌ఆర్‌ఎల్ లెవన్‌ను 4.5 అడుగులకు పెంచారు. దీంతో 1978 సంవత్సరం నుంచి ప్రాజెక్టు నీటిమట్టం 1,405 అడుగుల (17.8 టీఎంసీ)కు చేరింది. సుమారు వందేళ్ల చరిత్ర గల ఈ ప్రాజెక్టులోకి ఈసారి ఊహించనంతగా వరద వచ్చి రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 180 టీఎంసీల నీరు వచ్చి చేరిందని నీటి పారుదల శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇంత స్థాయిలో నీరు వచ్చింది ఇదే మొదటిసారని అధికారులు పేర్కొంటున్నారు. మంజీరపై సింగూరు వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించకముందు ఎప్పుడో వరద వచ్చిందని, గడచిన నలభై ఏళ్లలో ఈ స్థాయిలో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో లేదని చెబుతున్నారు. గతనెల 18 న ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటిని వదలడం మొదలవగా మధ్యలో ఒకటి రెండు రోజులు మినహా నేటి వరకు వదులుతూనే ఉన్నారు. ఇప్పటివరకు 166 టీఎంసీల నీటిని వరద గేట్ల ద్వారా దిగువకు వదిలారు.
ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద లక్షన్నర ఎకరాలలో పంటలు సాగవుతున్నాయి. ప్రాజెక్టు నిండుకుండలా ఉండడంతో ఆయకట్టుకు రెండు పంటలకూ భరోసా లభించింది. గతంలో ఒక్కోసారి సరైన వర్షాలు లేక ప్రాజెక్టు నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి చేరి పంటలకు నీరందించడం ఇబ్బందికరంగా ఉండేది. ఈసారి వర్షాకాలం పంటలు చాలావరకు పొట్టదశలో ఉన్నాయి. కొన్నిచోట్ల కోతకు వచ్చాయి. ఇప్పటికీ ప్రాజెక్టు నిండుగా ఉండడం, పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లో వస్తుండడంతో వచ్చే యాసంగితో పాటు తరువాతి వర్షాకాలం పంటలకూ ఢోకా ఉండదన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది.
నిజాంసాగర్ ప్రాజెక్టుకు నాలుగు దశాబ్దాల కాలంలో ఈసారి వచ్చిన ఇన్‌ఫ్లోనే అత్యధికమైనదని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతనెల 28న నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 2,50,912 క్యూసెక్కుల నీరు వచ్చింది. దీంతో 2.20 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఒక రోజులో ఈ స్థాయిలో ఇన్‌ఫ్లో రావడం, ఔట్‌ఫ్లో వెళ్లడం ఇదే మొదటిసారి అధికారులు తెలిపారు. సింగూరు నుంచి మంజీర పరవళ్లు తొక్కుతూ రాగా.. పోచారం ప్రాజెక్టు నుంచి కూడా భారీ వరద వచ్చింది.
ఎగువన వర్షాలు కురుస్తూనే ఉండడంతో మంజీర జీవనదిలా మారింది. గడచిన 38 రోజులుగా నది పారుతూనే ఉంది. వర్షాలు పడుతుండడంతో మంజీర మరికొన్ని రోజులు పారే అవకాశం ఉంది. ఎగువన మెదక్, సంగారెడ్డి జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మంజీర నదికి వరద తగ్గడం లేదు. బుధవారం 70,328 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. పది గేట్ల ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్టుకు గతంలో ఎన్నడూ లేనంతగా ఇన్‌ఫ్లో వచ్చింది. దాదాపు అదే స్థాయిలో నీటిని దిగువకు వదిలాం. దాదాపు నలభై ఏళ్ల చరిత్రలో ఇదే ఎక్కువ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో. ఎప్పటికప్పుడు ఇన్‌ఫ్లోను, ప్రాజెక్టును పర్యవేక్షిస్తూ ఎక్కడా నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నాం. ఎగువన అలాగే దిగువన ముంపు సమస్య తలెత్తకుండా ప్రజల్ని అప్రమత్తం చేశాం.
– టి.శ్రీనివాస్, చీఫ్ ఇంజినీర్, కామారెడ్డి
నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి
ఈ సీజన్‌లో 180 టీఎంసీల ఇన్‌ఫ్లో
నెల రోజుల్లో గేట్ల ద్వారా
166 టీఎంసీలు విడుదల
ఒకరోజు గరిష్ట ఇన్‌ఫ్లో
2.50 లక్షల క్యూసెక్కులు
40 ఏళ్లలో ఇదే అత్యధికమంటున్న అధికారులు