
‘స్థానిక’ రిజర్వేషన్లు ఫైనల్!
జోరుగా చర్చలు..
గత ఎన్నికల రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని..
స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్ల జాబితా ఫైనల్ అయ్యింది. జెడ్పీ చైర్మన్ పదవిని రాష్ట్ర స్థాయిలో ఖరారు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులతో పాటు ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు రూపొందించిన రిజర్వేషన్ల జాబితాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో బుధవారం ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
పంచాయతీ వార్డు స్థానాల రిజర్వేషన్లపై ఎంపీడీవోల ఆధ్వర్యంలో, సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలు ఆర్డీవోల స్థాయిలో, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో కసరత్తు జరిగింది. అధికారులు ఖరారు చేసి ఇచ్చిన రిజర్వేషన్ల జాబితాలను కలెక్టర్ ఒకటికి రెండుసార్లు పరిశీలించి వాటిని ఉన్నతాధికారులకు నివేదించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా బీసీలకు సీట్లు రిజర్వు చేశారని సమాచారం.
ఇతర రిజర్వేషన్లు అన్నీ 2011 జనాభా లెక్కల ఆధారంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను అధికారులు ఫైనల్ చేసినా.. గోప్యత పాటిస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారు విషయం లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఏ స్థానం ఏ వర్గానికి రిజర్వ్ అయ్యిందన్న దానిపై రాజకీయ పార్టీల నేతలు తెలుసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలో భాగమైన అధికారులు, సిబ్బందికి కలెక్టర్ సీరియస్‌గా చెప్పడంతో వివరాలు చెప్పడానికి ఎవరూ ధైర్యం చేయడంలేదని తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్కారు కసరత్తు చేస్తుండడం, రిజర్వేషన్ల జాబితాను రూపొందించడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రిజర్వేషన్ల అంశం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆయా మండలాల్లో జనాభా ఆధారంగా ఫలానా మండలం ఫలానా వర్గానికి రిజర్వ్ కావచ్చని, ఫలానా జెడ్పీటీసీ స్థానం జనరల్ అయ్యిందని, ఎంపీపీ స్థానం బీసీలకు రిజర్వ్ చేశారని ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. కాగా కొన్ని మండలాల్లో అధికారుల ద్వారా రిజర్వేషన్ల వివరాలు లీక్ అయినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటిస్తే గానీ రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.
2019లో జరిగిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికల్లో అమలు చేసిన రిజర్వేషన్లను అధికారులు పరిశీలించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రెండు టర్మ్‌లు ఒకే రిజర్వేషన్ ఉండాల్సింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసింది. గత ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లలో దాదాపు అన్ని మారినట్లు తెలుస్తోంది. అప్పుడు జనరల్ అయిన స్థానం ఇప్పుడు ఇతర వర్గాలకు రిజర్వ్ అయినట్లు సమాచారం. ఇలా జిల్లాలోని ఆయా మండలాల ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల్లో చాలావరకు గత ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లలో మార్పులు జరిగాయని సమాచారం. అలాగే ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకూ రొటేషన్‌లో మార్పు జరిగినట్లు తెలుస్తోంది.
గోప్యత పాటిస్తున్న
అధికారులు
ఫలానా స్థానం ఫలానా
వర్గానికి రిజర్వ్
అయ్యిందంటూ ప్రచారం
రాజకీయ వర్గాల్లో
తీవ్ర ఉత్కంఠ