
సోయాపై రైతుల్లో ఆశలు!
పంట బాగుంది
కోతలు మొదలవుతాయి..
మద్నూర్: జిల్లాలో సోయా పంట ఆశాజనకంగా ఉంది. మరో పక్షం రోజుల్లో కోతకు రానుంది. పంట బాగుండడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఈసారి 80,476 ఎకరాల్లో సోయా పంట సాగయ్యింది. మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, డోంగ్లీ మండలాల్లో రైతులు అధికంగా ఈ పంట పండిస్తున్నారు. జిల్లాలో 60 శాతం వరకు సోయా పంట ఇక్కడే పండుతుంది. కాలం అనుకూలంగా ఉండడంతో పంట ఏపుగా పెరిగింది. ఈసారి పెద్దగా తెగుళ్ల బెడద కూడా లేకపోవడంతో కాత బాగుంది. మరో పక్షం రోజులు వాతావరణం అనుకూలిస్తే గట్టెక్కినట్లేనన్న అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.
భారీగా కాత..
సోయాబీన్ విత్తనాలు వేసిననాటి నుంచి కురుస్తున్న వర్షాలు పంటకు మేలు చేశాయి. సోయా పంటకు కా వాల్సినంత నీరందడంతో ఏపుగా పెరిగింది. ఈసారి భారీగా కాత కాసింది. మోకాలి ఎత్తులో ఉన్న సోయా పంట కళకళలాడుతోంది. పక్షం రోజుల్లో కోతలు ప్రా రంభం కానున్నాయి. మంచి దిగుబడులు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి రావొచ్చని పేర్కొంటున్నారు.
ఈసారి వర్షాలు బాగానే కురవడంతో సోయాబీన్ పంట బాగుంది. ప్రస్తుతం భారీ కాయలతో ఉంది. గుత్తులు గుత్తులుగా కాయలున్నాయి. వాటిని చూస్తే ఆనందం వేస్తోంది. మరో 15 రోజుల్లో పంట చేతికి అందనుంది. – దత్తు, రైతు, మద్నూర్
జిల్లాలో సోయా పంట వేసి మూడు నెలలు అవుతోంది. ఈసారి పంట బాగా పెరిగింది. కాయలు కూడా బాగా కాశాయి. ప్రస్తుతం సోయకాయ దశలో ఎండుతోంది. మరో పదిహేను రోజుల్లో కోతలు మొదలవుతాయి. – రాజు, ఏవో, మద్నూర్
జిల్లాలో 80,476 ఎకరాల్లో
పంట సాగు
అనుకూలించిన వర్షాలు..
దిగుబడి పెరుగుతుందని ఆశాభావం
పక్షం రోజుల్లో చేతికందనున్న పంట