
నేడు అంగన్‌వాడీల చలో హైదరాబాద్
బాన్సువాడ : అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గురువారం నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు ఖలీల్ పిలుపునిచ్చారు. బుధవారం బాన్సువాడ సీడీపీవో సౌభాగ్యను కలిసి 25న అంగన్‌వాడీ కేంద్రాల బంద్ నోటీసును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ టీచర్లకు కనీస వేతనం రూ. 24 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. చలో హైదరాబాద్‌కు అంగన్‌వాడీ టీచర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు మాధవి, ప్రతినిధులు గౌరీ, శివగంగ, సునీత తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: విద్యుత్ వినియోగదారులు సత్వర సేవలు పొందడానికి టీజీఎన్‌పీడీసీఎల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యుత్ శాఖ జిల్లా ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మొబైల్ ఫోన్ ప్లేస్టోర్‌లో యాప్ ఉందని పేర్కొన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1912తో పాటు 1800 425 0028 నంబర్లలోనూ విద్యుత్ సేవల కోసం సంప్రదించవచ్చని సూచించారు.
తాడ్వాయి: ప్రజలకు పనులు కల్పిస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కోకన్వీనర్ కృష్ణ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై బుధవారం ఎంపీడీవో సాజిద్ అలీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిన్నరగా నాలుగు నెలలకోసారి వేతనాలు ఇస్తున్నారన్నారు. ఈసారి ఐదు నెలలైనా వేతనాలు రాలేదని పేర్కొన్నారు. పండుగలోపు వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ ఉద్యోగ సంఘాల నాయకులు స్వామి, రామకృష్ణ, రేఖ, రాణి తదితరులున్నారు.
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని దేవునిపల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మండపంలో గురువారం ఉదయం 9 గంటలకు విజయదశమి ఉత్సవం నిర్వహించనున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు సిద్ధిరాములు, శివరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాన సంఘ్ ఇందూర్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ విజయ్‌భాస్కర్ కృష్ణశాస్త్రి పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.
నిజామాబాద్‌నాగారం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో హైరిస్క్‌లో ఉన్న గర్భిణీకి వైద్యులు ప్రసవం చేశారు. కోటగిరికి చెందిన 23 ఏళ్ల సిమ్రాన్‌బేగం ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉండి బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. 37 వారాల 4 రోజుల గర్భంతో ఉండి ప్రసవ వేదను అనుభవిస్తున్న సిమ్రాన్‌బేగంకు జీజీహెచ్ వైద్యులు రెండు యూనిట్ల ఆర్డీపీ, ఒక యూనిట్ ఎస్డీపీ ప్లేట్‌లెట్ ట్రాన్స్‌ఫ్యూషన్ ఇచ్చారు. ఆ తరువాత ఆమెకు ప్లేట్‌లెట్ కౌంట్ 57,000కు పెరిగింది. వైద్య బృందం సకాలంలో స్పందించి సిమ్రాన్‌బేగంకు చికిత్స అందించడంతో ఆమె మొదటికాన్పులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డల ప్రాణాలను రక్షించిన హౌస్ సర్జన్ హేమంత్, వైద్యులు లక్ష్మీప్రసన్న, హారిక, ఆశ్రిత, రమ్య, రశ్మితకు సిమ్రాన్ బేగం భర్త మహ్మద్ రసూల్‌తోపాటు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.