
నాణ్యమైన వైద్యసేవలందించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్: బస్తీ దవాఖానాలలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్‌తో కలిసి జిల్లా కేంద్రంలోని హరిజనవాడ బస్తీ దవాఖానాను సందర్శించారు. వైద్య సేవలను, వైద్యులు, వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. అధిక వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండి సేవలు అందించాలని సూచించారు. ఆస్పత్రితో పాటు ఆస్పత్రి పరిసరాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. బస్తీ దవాఖానా పక్కన నిర్మిస్తున్న బాలసదనం భవన నిర్మాణాన్ని పరిశీలించి, నాణ్యతతో వేగంగా భవన నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డిని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ జనార్దన్ తదితరులు ఉన్నారు.