
అంగట్లోకి అంగన్‌వాడీ సరుకులు
● పట్టించుకోని ఐసీడీఎస్ అధికారులు
మద్నూర్(జుక్కల్): అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు అందాల్సిన పౌష్టికాహారం మద్నూర్ మండలంలో పక్కదారి పడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయా కేంద్రాలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సరుకుల విషయంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అంగన్‌వాడీ నిర్వాహకులు, ఆయాలు బహిరంగ మార్కెట్‌లో వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మద్నూర్ మండలంలోని పలు కిరాణ దుకాణాల్లో అంగన్‌వాడీకి సరఫరా చేసే కంది పప్పు ప్యాకెట్‌లు దర్శనమిచ్చాయి. 30 కందిపప్పు ప్యాకెట్‌లను కిరాణ దుకాణంలో ఉంచి అంగన్‌వాడీ నిర్వాహకులు విక్రయించారు. దీనికి తోడు అంగన్‌వాడీ కేంద్రాల్లో నిల్వ ఉంచాల్సిన సరుకులు నేరుగా నిర్వాహకుల ఇళ్లలోకి తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రాలను పర్యవేక్షించే సీడీపీవో, సూపర్‌వైజర్‌లు కార్యాలయాలకే పరిమితం కావడంతో ఇలాంటి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతోనే మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయనే విమర్శలున్నాయి. ఇప్పటికై నా ఉన్నాతాధికారులు స్పందించి అంగన్‌వాడీ సరుకులు బహిరంగ మార్కెట్‌లోకి తరలకుండా నిఘా వేయాలని పలువురు కోరుతున్నారు.
ఇటీవల కాలం చెల్లిన పాల పంపిణీ
ప్రభుత్వం గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం పాలు అందిస్తున్నా అవి కాలం చెల్లినవా లేదా అని చూసుకోకుండా పంపిణీ చేస్తున్నారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేనూర్ అంగన్‌వాడీ కేంద్రంలో 3 నెలల క్రితం పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. వాటిని ఇంటికి తీసుకెళ్లిన కొందరు పాల ప్యాకెట్‌ను పరిశీలించగా ఫిబ్రవరి నెలలోనే పాల ప్యాకెట్ వాడకం గడువు ముగిసిందని గుర్తించారు. అలాగే నాణ్యత లేని గుడ్లు కూడా పెడుతున్నారని మహిళలు వాపోతున్నారు.