
సాదాబైనామాకు మోక్షం లభించేనా?
కామారెడ్డి క్రైం/ఎల్లారెడ్డి : సాదాబైనామాల క్రమబద్ధీకరణకు కోర్టు చిక్కులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతుల ఏళ్లనాటి నిరీక్షణకు తెరపడింది. ఇకనైనా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కల్పించాలని రైతులు కోరుతున్నారు.
రెవెన్యూ రికార్డులకు సంబంధించిన ప్రధాన సమస్యల్లో సాదాబైనామా కూడా ఒకటిగా ఉంది. గతంలో భూముల క్రయవిక్రయాల సమయంలో చాలామంది తెల్ల కాగితాలపైనే ఒప్పందాలు చేసుకునేవారు. ఆర్థిక, ఇతర కారణాలతో పట్టాలు చేసుకోవడంలో ఆలస్యం జరిగేది. భూమి తమ ఖబ్జాలోనే ఉన్నా పట్టా పాసుపుస్తకాలు ఉండేవి కావు. తెల్ల కాగితాలపై మాత్రమే భూములు ఉండడంతో సంక్షేమ ఫలాలు అందేవి కాదు. సాదా కాగితాల మీద భూములు కొన్నా పట్టాలు కాకపోవడంతో రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాల లబ్ధి చేకూరలేదు. బ్యాంకు రుణాలకూ నోచుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఈ భూముల వ్యవహారం వివాదాలకు సైతం దారి తీసింది. ఇలాంటి సాదాబైనామాల సమస్యలను పరిష్కరించడానికి 2020 అక్టోబర్‌లో ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ ఏడాది అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించంది. అయితే కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో జీవోను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి 2020 కి ముందు సాదాబైనామాలకు దరఖాస్తు చేసుకున్న రైతుల సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి. తాజాగా మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేయడంతో లైన్ క్లియర్ అయ్యింది. ఆ వెంటనే సాదాబైనామాలకు పరిష్కారాలు చూపాలని ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.
చిగురించిన ఆశలు..
కామారెడ్డి జిల్లాలో 2020 కి ముందు సాదాబైనామాల కోసం 11,448 రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కోర్టులో కేసు ఉండడంతో వారికి పట్టాలు ఇవ్వలేదు. అయితే ఇప్పటికే అధికారులు క్షేత్ర స్థాయిలో చాలామంది రైతుల దరఖాస్తుల పరిశీలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం సంబంధిత డివిజన్‌లో ఆర్డీవోకు పూర్తి అధికారాలు ఉంటాయి. ఆయనే విచారణ అధికారిగా వ్యవహరిస్తారు. దరఖాస్తు చేసుకున్న రైతు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి, విచారణ జరిపి సంబంధిత రైతు అర్హుడా, కాదా అనే విషయాన్ని తేలుస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే దరఖాస్తును ఆమోదిస్తారు. అనంతరం రికార్డులు సరిచేసి పాస్‌బుక్‌లు జారీ చేస్తారు. వేగంగా ప్రక్రియను పూర్తి చేసి పట్టాలు ఇవ్వాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
తొలగిన కోర్టు చిక్కులు
పరిష్కారాలకు ఉత్తర్వులు
జారీ చేసిన ప్రభుత్వం
జిల్లాలో 11 వేలకుపైగా దరఖాస్తులు
2020 కి ముందు దరఖాస్తులకు పట్టాలు వచ్చే అవకాశం
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని మిసిమి హై స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న డి. అక్షిత్, ఎల్. రేవంత్ అనే విద్యార్థులు జాతీయ స్థాయి చౌక్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల కరెస్పాండెంట్ బాలి రవీందర్ తెలిపారు. గత నెల హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీ ల్లో వీరు జిల్లా జట్టు తరఫున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర జట్టుకి ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి 28 వరకు విశాఖపట్టణంలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీ లకు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంటారని అన్నారు. ఆదివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు, పీఈటీ సంజీవ్‌ను అభినందించి సత్కరించారు.