
వరి పంటపై తెగుళ్ల దాడి
● దెబ్బతింటున్న పంట
● ఆందోళన చెందుతున్న రైతన్నలు
● విచ్చలవిడిగా పురుగు మందుల వినియోగం
నిజాంసాగర్ : జిల్లాలోని ప్రధాన జలాశయాలతో పాటు చెరువులు, కుంటలు, బోరుబావులు, లిప్టుల కింద 2.8 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయ్యింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో పంటను చీడపీడలు పట్టిపీడిస్తున్నాయి. ప్రధానంగా ముందస్తుగా సాగు చేసిన పంట తెగుళ్లతో దెబ్బతింటోంది. పాముపొడ, ఎండు తెగులు, కంకినల్లి, సుడిదోమ వంటివి దెబ్బతీస్తున్నాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు పురుగుల మందుల దుకాణాలకు వెళ్లి పురుగుల మందులు తెచ్చి ఇష్టారీతిన పిచికారి చేస్తున్నారు. దీంతో చీడపీడల బాధ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో వరిని ఆశిస్తున్న చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను నిజాంసాగర్ ఏవో అమర్‌ప్రసాద్ వివరించారు.
● ఎండు తెగులు ఆశించిన వరిపంటపై స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 50 గ్రాములు లేదా కాపర్ అక్సిక్లోరైడ్ 300 గ్రాముల మందును 160 లీటర్ల నీటిలో కలిపి ఎకరం పొలంపై పిచికారి చేయాలి.
● పాముపొడ తెగులు, పొట్టకుళ్లు నివారణకు ప్రాపికొనజోల్ 200 మి.లీ. గాని, హెక్సాకొనజోల్ 400 మి.లీ. గాని 160 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారి చేయాల్సి ఉంటుంది.
● కంకినల్లి సొకితే స్పైరోమెసిఫెన్ 100 మి.లీ. మందును 160 లీటర్ల నీటిలో కలిపి ఎకరం విస్తీర్ణంలోని పంటపై పిచికారి చేయాలి.
● సుడిదోమ నివారణకు పైమెట్రోజైన్ 120 గ్రా. లేదా డైనోటెఫ్యూరాన్ 120 గ్రా. ఎకరానికి 160 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.