
వర్క్ ఇన్‌స్పెక్టర్ విధుల డుమ్మాపై విచారణ
నిజామాబాద్‌అర్బన్: ఇరిగేషన్ శాఖలోని ఓ వర్క్ ఇన్‌స్పెక్టర్ విధులకు సక్రమంగా హాజరుకాకపోవడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. మాక్లూర్ మండలంలో పనిచేసే ఓ వర్క్ ఇన్‌స్పెక్టర్ జిల్లా కేంద్రంలో మీ–సేవా కేంద్రం నిర్వహిస్తున్నాడు. దీంతో కొన్నిరోజులుగా అతడు విధులకు డుమ్మా కొడుతున్నాడు. ఈక్రమంలో స్థానికులు అతడిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు అధికారులు ఇటీవల విచారణ చేపట్టి నివేదికను కలెక్టర్‌తో పాటు ఇరిగేషన్ అధికారులకు పంపించారు.
కారేగాం తండావాసికి డాక్టరేట్
నిజామాబాద్‌అర్బన్: చందూరు మండలం కారేగాం తండాకు చెందిన రామావత్ లాల్‌సింగ్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. లాల్‌సింగ్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో రెండు డిగ్రీలు, తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మాస్టర్ లైబ్రరీ సైన్స్ పూర్తి చేశారు. ‘భారతదేశ స్వాతంత్య్రం అనంతరం దేశంలోని సంస్కృతి, సంప్రదాయాల మధ్య జరుగుతున్న ఘర్షణలపై’ పరిశోధన చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో సమకాలిన్ హిందీ ఉపన్యాసం మే ఏ సాంప్రదాయక సంఘర్ష అనే అంశంపై ఆయన సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించారు. లాల్‌సింగ్ పరిశోధనపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రొఫెసర్లు పరిశోధకులు డాక్టరేటును అందించారు.
మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి
నిజామాబాద్ రూరల్: దేవీ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని రూరల్ ఎస్‌హెచ్‌వో మహ్మద్ ఆరిఫ్ సూచించారు. నగరంలోని కేసీఆర్ కాలనీలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్‌లో దేవీ నవరాత్రి ఉత్సవాల మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. మండపాలకు విద్యుత్ కనెక్షన్లు ఫ్రీగా ఉన్నప్పటికి విద్యుత్ అధికారులను సంప్రదించి కనెక్షన్లు తీసుకోవాలన్నారు. అదేవిధంగా మండపాల వద్ద రాత్రి ఇద్దరు వ్యక్తులు ఉండాలని, డీజే సౌండ్‌సిస్టమ్‌లను నిషేదించినట్లు తెలిపారు. నిమజ్జన సమయంలో దేవీమాతలను త్వరగా నిమజ్జనానికి తరలించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో సీఐ సురేశ్‌కుమార్, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

వర్క్ ఇన్‌స్పెక్టర్ విధుల డుమ్మాపై విచారణ