
ఎకరానికి రూ.లక్ష పరిహారం చెల్లించాలి
● మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
సదాశివనగర్(ఎల్లారెడ్డి): వరదల్లో పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. వరదలు వచ్చిన పది రోజులకు కామారెడ్డి పర్యటకు వచ్చిన సీఎం రైతులకు ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. కేవలం ఫోటో ఎగ్జిబిషన్ చూసి వెళ్లారని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన నష్టం కంటే ఎక్కువగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఈ ఏడు మండలాల్లో సారవంతమైన భూముల్లో సాగు చేసిన పంటలు వరద ఉధృతికి కొట్టుకుపోవడమే కాకుండా చాలా చోట్ల పంటపై ఇసుక మేటలు వేయడంతో తీవ్రమైన నష్టం జరిగిందన్నారు. ఏడు మండలాల్లో సుమారుగా 20 వేల ఎకరాలకు పైగా పంట జరిగి ఉంటుందని, కానీ అధికారులు మాత్రం జిల్లా వ్యాప్తంగా 23 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని లెక్కలు చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు కమిలి నర్సింలు, పడిగెల రాజేశ్వర్ రావు, విండో చైర్మన్ కమలాకర్ రావు, జిల్లా మాజీ కో–ఆప్షన్ మోహినొద్దిన్, నాయకులు గడీల భాస్కర్, శ్రీనివాస్ నాయక్, అల్తాప్ పాల్గొన్నారు.
నాగులమ్మ గుడిలో ప్రత్యేక పూజలు
సదాశివనగర్/ఎల్లారెడ్డిరూరల్/గాంధారి: మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా నిర్మించిన నాగులమ్మ గుడిలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గుడి నిర్మాణం కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌లో, గాంధారిలో పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు.