
పెండింగ్ కేసులను పరిష్కరించాలి
● బాధితులకు న్యాయం అందించాలి
● ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి క్రైం : పోలీస్ స్టేషన్‌లలో పెండింగ్‌లో ఉ న్న కేసులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాయలంలో శుక్రవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, బాధితులకు సత్వర న్యాయం అందించాలని సూచించారు. దొంగతనం, ఆస్తి సంబంధిత నేరాలకు సంబంధించి పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. మత్తు పదార్థాలకు సంబంధించిన కేసుల్లో నేరస్తులపై హిస్టరీ షీట్‌లను తెరవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్‌లుగా గుర్తించి సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డయల్ 100 కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి, సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలవాలన్నారు. సైబర్ నేరాలపై క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలన్నారు. ఫేక్ నంబర్ ప్లేట్లు, నంబర్ ప్లేట్ల మార్పుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డీజేలకు అనుమతులు లేవన్నారు. భక్తిశ్రద్ధలతో సంప్రదాయాలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు.