
పౌష్టికాహారం తీసుకోవాలి
లింగంపేట: శారీరక, మానసిక దృఢత్వానికి పౌష్టికాహారం తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం పోతాయిపల్లి హైస్కూల్‌లో నిర్వహించిన స్వచ్చతా హీ సేవా, పోషణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛతపై విద్యార్థులు ఏర్పాటు చేసిన మానవహారంలో పాల్గొని స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలను శుభ్రపరచడం, పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు చేయించడం, ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆకర్షణీయమైన వస్తువులు తయారు చేయడం లాంటి కార్యక్రమాలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో స్టోర్ రూం, వంటగదిని పరిశీలించారు. చిన్నారులతో ముచ్చటించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పేయింటింగ్ వేయించాలని ఐసీడీఎస్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, డీఆర్డీవో సురేందర్, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, జిల్లా బాలల సంరక్షణ అధికారి స్రవంతి, ఎంపీడీవో నరేష్, తహసీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.