
ఆరుబయట చదువులు
అమ్మ ఆదర్శ కమిటీ వేశాం
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆలనాపాలన చూసేవారు కరువయ్యారు. కళాశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి కూలిపోయే పరిస్థితికి వచ్చింది. 12 గదులలో 6 తరగతి గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరి పైకప్పు పెచ్చులు ఊడిపోయి గోడలు, స్లాబ్‌ల నుంచి నీరు ఊరుతున్నాయి. ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో లెక్చరర్లు కళాశాల ఆవరణలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం కళాశాల కొనసాగుతున్నాయి. తెలుగు, ఇంగ్లిష్ మీడియం ప్రథమ సంవత్సరంలో 272 మంది విద్యార్థులు, సెకండియర్‌లో 239 మంది విద్యార్థులు.. 11 మంది లెక్చరర్లు ఉన్నారు. అలాగే ఉర్దూ మీడియం ప్రథమ సంవత్సరంలో 45 మంది, సెకండియర్‌లో 55 మంది విద్యార్థులు, 9 మంది లెక్చరర్లు ఉన్నారు. మూడు రకాల మీడియం తరగతులలో మొత్తం 611 మంది విద్యార్థులు, 20 మంది లెక్చరర్లు ఉన్నారు. శిథిలావస్థలో ఉన్న గదులలో విద్యార్థులను కూర్చోపెట్టవద్దని ప్రిన్సిపాల్‌ను జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ఆవరణలో పాఠాలు బోధిస్తున్నారు. 611 మంది విద్యార్ధులకు 6 తరగతి గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ల్యాబ్ సౌకర్యం లేదు.
నిధులున్నా అమ్మ ఆదర్శ కమిటీతో
కాలయాపన..
గదుల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.43 లక్షలు మంజూరు చేసింది. అధికారులు ఖాతాలో అలాగే మురుగుతున్నాయి. అమ్మ ఆదర్శ కమిటీ వేయాలని పైఅధికారులు ఆదేశాలిచ్చారు. కమిటీ పేరుతో కాలయాపన జరుగుతుంది. నిధులు మంజూరై నెలల గడుస్తున్నా ప్రయోజనం లేదు. తూతుమంత్రంగా మరమ్మతులు చేసి అధికారులు చేతులు దులుపుకోవద్దని.. వాటిని కూలగొట్టి కొత్త గదులు నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులు స్పందించి కొత్త గదులు, ల్యాబ్ మంజూరు చేయించాలని కోరుతున్నారు.
56 ఏళ్ల కళాశాల నిర్మాణం..
మరమ్మతుల కోసం రూ.43 లక్షలు నిధులు మంజూరయ్యాయి. పై అధికారుల ఆదేశాల మేరకు కళాశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ఏర్పాటు చేసి బ్యాంక్ ఖాతా తెరుస్తున్నాం. గదులు లేక ఆవరణలో కూర్చోబెట్టి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాం. త్వరలోనే గదుల మరమ్మతులు చేపడతాం. – మోహన్‌రెడ్డి,
జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, బిచ్కుంద
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి సారిగా 1969లో బిచ్కుందలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటైంది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఆనాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన చేతులు మీదుగా కళాశాల ప్రారంభించారు. ప్రారంభమై నేటికి 56 ఏళ్లు అవుతుంది. ఆనాడు కరీంనగర్, మెదక్, నిజామాబాద్ నుంచి విద్యార్థులు కళాశాలలో చేరి చదువుకున్నారు. ఎంతో మంది ఈ కళాశాలలో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కళాశాల అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
శిథిలావస్థకు చేరిన జూనియర్ కళాశాల
నీరు ఊరుస్తున్న గదులు
బురద నేలపై కూర్చుని పాఠాలు
వింటున్న విద్యార్థులు
రూ.43 లక్షలు నిధులున్నా
జరగని మరమ్మతులు

ఆరుబయట చదువులు

ఆరుబయట చదువులు