
వీరులకు వందనం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం నిరంకుశ పాలన కిందే ఉండిపోయింది. దీంతో స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు ఈ ప్రాంత ప్రజలు పోరాటాన్ని కొనసాగించారు. అటు ఆర్యసమాజ్ ద్వారా ఒక ఉద్యమం, ఇటు కమ్యూనిస్టుల సాయుధ పోరాటం మరోవైపు కొనసాగాయి. ఇరువురి లక్ష్యం తెలంగాణ విముక్తి. ఈ పోరాటంలో ఎందరో తమ ప్రాణాలను అర్పించారు. మరెందరో జైలు జీవితం గడిపారు. నిజాం పోలీసులు ఎంతో మందిని చిత్రహింసలకు గురిచేశారు. అప్పటి యువత ప్రాణాలకు ఒడ్డి నిజాంకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. వారిలో చాలా మంది మరణించారు. కామారెడ్డి ప్రాంతానికి చెందిన చాకలి సాయన్న, రాజారెడ్డి, లక్ష్మారెడ్డి, గంగారెడ్డి, ఆగమయ్య, గుండారెడ్డి, రాజీరయ్య, వెంకయ్య, మల్లయ్య, రాంచంద్రం, నారా యణరెడ్డి, భూమారెడ్డి, గోపాల్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, బాదల్‌చంద్, గంగయ్య, బాల్‌లింగం, కిషన్‌రావ్ తదితరులు నిజాం పాలకులతో పోరులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జిల్లాలోని దోమ కొండ, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద ప్రాంతాలకు చెందిన వందలాది మంది నిజాం పాలనపై జరిగిన అన్ని పోరాటాల్లో భాగమయ్యారు. తర్వాతి కాలంలో కొందరిని ప్రభుత్వాలు స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించాయి.
‘ఫణిహారం’ కీలక పాత్ర...
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరులో ఫణిహారం రంగాచారిది వీరోచిత పోరాటం. పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు లక్ష్మణాచారి కుమారుడైన రంగాచారి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. చిత్రలేఖనంలో మంచి ప్రావీణ్యం ఉన్న రంగాచారితో పాటు ఆయన మిత్రుడు విఠల్‌రావ్‌లను అప్పటి ఉపాధ్యాయుడు బషీరొద్దీన్ హైదరాబాద్‌లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేర్పించాడు. రంగాచారి చదువుకుంటున్న సమయంలో హైదరాబాద్ సంస్థానంలో రజాకార్ల కార్యకలాపాలు జోరుగా సాగేవి. వారికి దీటుగా ఆర్యసమాజ్ ఉద్యమం బలంగా వ్యాప్తిచెందడంతో రంగాచారి, విఠల్‌రావ్‌లు అటువైపు నడిచారు. ఆర్యసమాజ్ హిందువులకే ప్రాధాన్యం ఇవ్వడంతో వాళ్లిద్దరు హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ నాయకులైన జవాద్‌రజ్హీ, డాక్టర్ పరంజపేలతో సంబంధం పెట్టుకుని విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పనిచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాముల దోపిడీ, నిర్భంద పన్నుల వసూళ్లు, లెవీ వసూళ్లపై రంగాచారి ఎన్నో చిత్రాలు గీశాడు. ఆయన గీసిన చిత్రాలు ఇప్పటికీ హైదరాబాద్‌లోని ముగ్దుంభవన్‌లో ఉన్నాయి.
1946 లో కమ్యూనిస్టు పార్టీ నిషేధానికి గురికావడంతో పార్టీ కార్యదర్శిగా కేఎల్ మహేంద్ర ఎన్నికై రహస్య స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఉద్యమాన్ని కొనసాగించారు. ఈ సమయంలో రంగాచారి తన సహచరులు బాసిత్, షానూర్‌అలీ, నర్సింగ్‌రావ్ మరికొందరితో కలిసి ఆయుధాలు సేకరించే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. సేకరించిన ఆయుధాలను ఉద్యమ ప్రాంతాలకు పంపించేవారు. అంతేగాకుండా ఉస్మానియా ఆస్పత్రి నుంచి రాజ్‌బహదూర్‌గౌడ్, ఎస్‌పీకే ప్రసాద్‌లను పోలీసు కస్టడీల నుంచి తప్పించడంలో రంగాచారి ప్రముఖ పాత్ర పోషించారు. కమ్యూనిస్టు నేత చెన్నమనేని రాజేశ్వర్‌రావ్‌ను కూడా ఆయన కాపాడారు. ఈ క్రమంలో నల్గొండకు చెందిన రామచంద్రారెడ్డి ఎలుగుబంటి దాడిలో గాయపడగా చికిత్స కోసం చిలుకలగూడలో రంగాచారి నిర్వహిస్తున్న రహస్య స్థావరానికి తీసుకువచ్చారు. అయితే రంగాచారి ఆయనను వెంటనే ఇతర ప్రాంతానికి తరలించారు. ఎడ్లబండిపై పడ్డ రక్తపు మరకల ఆధారంగా పోలీసులు రామచంద్రారెడ్డిని తీసుకువచ్చిన బండి యజమానిని పట్టుకుని చిత్రహింసలకు గురిచేయడంతో రహస్య స్థావరం వివరాలు తెలిశాయి. నిజాం పోలీసులు అక్కడికి చేరుకుని రంగాచారి, వెదిరె రాజిరెడ్డిలను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలులో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. రంగాచారి నుంచి రహస్యాలను రాబట్టలేని పోలీసులు.. వరంగల్ జిల్లాలోని మామునూర్ కాన్‌సన్‌ట్రేషన్ క్యాంపునకు తరలించి అక్కడ చిత్రహింసలకు గురిచేసి బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపారు. రంగాచారి త్యాగాలను స్మరించుకునేందుకుగాను కామారెడ్డి పట్టణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏటా తెలంగాణ విముక్తి రోజైన సెప్టెంబర్ 17న రంగాచారి విగ్రహం వద్ద పలు కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు బాసిన వీరులను స్మరించుకుంటున్నారు.
గోపాల్ రెడ్డి
వకీల్ భూమారెడ్డి
నారాయణ రెడ్డి
ఫణిహారం రంగాచారి
విఠల్ రెడ్డి
1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి విముక్తమై మిగతా భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నా.. తెలంగాణ ప్రజలు మాత్రం నిరంకుశ నిజాం పాలనలోనే మగ్గిపోవాల్సి వచ్చింది. స్వేచ్ఛ కోసం మరికొంతకాలం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు 13 నెలలపాటు ఈ ప్రాంత బిడ్డలు తిరగబడ్డారు. నిజాం సేనల చేతిలో క్రూరమైన చిత్రహింసలను ఎదుర్కొన్నారు. చివరికి 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు విముక్తి సాధించారు. నిజాం విముక్తి పోరుకు 77 ఏళ్లు నిండిన సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
నిజాం నిరంకుశ పాలనకు
వ్యతిరేకంగా పోరాటం
క్రియాశీలక పాత్ర పోషించిన
జిల్లావాసులు
‘విముక్తి’ పోరులో అమరులెందరో..
నేడు తెలంగాణ స్వేచ్ఛా
వాయువులు పీల్చిన రోజు

వీరులకు వందనం

వీరులకు వందనం

వీరులకు వందనం

వీరులకు వందనం

వీరులకు వందనం