
నేటినుంచి ‘స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్’
● మహిళల ఆరోగ్యాన్ని
మెరుగుపరచడమే లక్ష్యం
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం : మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా దేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్’ను రూపొందించిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమం బుధవారం దేశవ్యాప్తంగా ప్రారంభం అవుతోందన్నారు. కార్యక్రమం అమలుపై మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, తద్వారా కుటుంబాన్ని బలోపేతం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్ చందర్ నాయక్, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, డీఈవో రాజు, డీటీవో శ్రీనివాస్‌రెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి సతీష్ యాదవ్, యువజన సంక్షేమ అధికారి వెంకటేష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.