
దెబ్బతిన్న బంజర– లింగంపల్లికలాన్ రోడ్డు
శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు
● ప్రారంభంకాని రోడ్డు మరమ్మతు పనులు
● ప్రమాదకర పరిస్థితుల్లో
రాకపోకలు సాగిస్తున్న గ్రామస్తులు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నాగిరెడ్డిపేట మండలంలోని బంజర నుంచి లింగంపల్లికలాన్ గ్రామానికి వెళ్లే రోడ్డు రెండు చోట్ల తీవ్రంగా దెబ్బతిన్నది. బంజర–లింగంపల్లికలాన్ రోడ్డుకు ఒకవైపు పోచారం ప్రధాన కాలువ ఉండగా మరోవైపు పంటపొలాలున్నాయి. రోడ్డుకు ఒకవైపు ఉన్న పోచారం ప్రధాన కాలువ కింద నుంచి అక్కడక్కడా అండర్ టన్నెల్స్(నేల మోరీలు) ఉన్నాయి. అండర్ టన్నెల్స్ నుంచి వరదనీరు ఉప్పొంగి ప్రవహించడంతో రెండుచోట్ల మట్టి కొట్టుకుపోయి భారీ గుంతలు ఏర్పడ్డాయి. అండర్ టన్నెల్స్ వద్ద మట్టి కోతకు గురై సైడ్‌వాల్స్ కూలిపోయి ఏర్పడిన భారీగుంతలతో ప్రయాణికులు భయపడుతున్నారు. భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు రోజురోజుకు మరింత ధ్వంసమవుతోంది.
ఈ రోడ్డుకు ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతు పనులు ప్రారంభం కాలేదు. ఈ రోడ్డుపై గతయేడు వర్షాలతో ఒక చోట అండర్‌టన్నెల్ వద్ద దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టేందుకు నీటిపారుదలశాఖ ద్వారా రూ.10 లక్షల నిధులు మంజూరయ్యాయి. కాని మరమ్మతు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోగా ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగా రోడ్డు మరింత దెబ్బతిన్నది. ఈ రోడ్డుపై రాకపోకలు సజావుగా సాగేలా అధికారులు చర్యలు చేపడితే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
బంజర–లింగంపల్లికలాన్ రోడ్డు గతయేడు వర్షాలతో ఒక అండర్ టన్నెల్ వద్ద దెబ్బతిన్నది. గత నెలాఖరున కురిసిన భారీవర్షాలకు మరో అండర్‌టన్నెల్ వద్ద రోడ్డు దెబ్బతిన్నది. కాగా రోడ్డు ధ్వంసమైన అండర్‌టన్నెల్స్ వద్ద శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాం.
– వెంకటేశ్వర్లు, డీఈఈ, ఇరిగేషన్ శాఖ, ఎల్లారెడ్డి

దెబ్బతిన్న బంజర– లింగంపల్లికలాన్ రోడ్డు