
సహకార సంఘం వద్ద రైతుల ఆందోళన
పిట్లం(జుక్కల్): రాంపూర్ సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. సహకార సంఘానికి 440 బ్యాగుల యూరియా వచ్చింది. మంగళవారం యూరియాను సరఫరా చేసే సమయంలో రైతులు ఆందోళనకు దిగారు. సహకార సంఘం పరిధిలో గౌరారం, గౌరారం తండా, బండపల్లి, మద్దెల చెరువు, బొల్లక్‌పల్లి తదితర గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు యూరియా కోసం పాస్‌బుక్‌లను పట్టుకొని సహకార సంఘం ముందు క్యూలో నిలబడ్డారు. కేవలం 440 సంచుల యూరియా రావడంతో, టోకెన్ల ప్రకారం ఒక పాస్ బుక్‌కు ఒక యూరియా బస్తాను సహకార సంఘం సిబ్బంది సరఫరా చేశారు. వచ్చిన యూరియా కొద్ది సమయంలోనే అయిపోవడంతో, మిగిలిన రైతులు ఆందోళనకు దిగారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని సహకార సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పిట్లం ఎస్సై వెంకటరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. దీంతో రైతులు వెనుతిరిగి వెళ్లారు.