
క్రైం కార్నర్
● మద్నూర్‌లో చోటుచేసుకున్న విషాద ఘటన
● కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
తొట్టెలో పడి బాలుడు మృతి
మద్నూర్(జుక్కల్): నీటి తొట్టెలో పడి బాలుడు ప్రాణాలు వదిలాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిర నగర్ కాలనీకి చెందిన మేత్రివార్ రాజు, అనిత దంపతులు మద్నూర్‌లోని పాత బస్టాండ్‌లో టీ పాయింట్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాజు టీ పాయింట్‌లో ఉండగా, అనిత ఇంట్లో వంట చేస్తోంది. వీరికి ఇద్దరు కొడుకులు ఉండగా చిన్న కొడుకు అక్షయ్ (2) ఇంటి ముందు ఆడుకుంటూ నీటి తొట్టె వద్దకు వెళ్లాడు. అక్షయ్ చేతిలో ఉన్న ఆట వస్తువు నీటి తొట్టెలో పడటంతో దాన్ని తీసుకోవడానికి వంగడంతో బ్యాలెన్స్ తప్పి తల నీటి తొట్టెలోకి పడిపోయి కాళ్లు బయటకు తేలాయి. కొద్ది సేపటికి తల్లి అనిత బయటకు వచ్చి చూడగా అక్షయ్ నీటి తొట్టెలో కనిపించాడు. బాలుడిని నీటి తొట్టెలోంచి బయటకు తీసి స్థానికులతో కలిసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్‌కొండ తెలిపారు.

క్రైం కార్నర్