
మద్నూర్‌లో మళ్లీ చిరుత పులి అలజడి..!
● ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● జుక్కల్ రేంజ్ ఫారెస్టు అధికారిణి సుజాత
మద్నూర్(జుక్కల్): చిరుత పులిపై ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జుక్కల్ రేంజ్ ఫారెస్టు అధికారిణి సూజాత సూచించారు. మండల కేంద్రంలో చిరుత పులి వచ్చిందని సమాచారం మేరకు శనివారం ఆమె, సిబ్బందితో కలిసి పంట చెలల్లో పరిశీలించారు. పొలంలో గడ్డి కోసుకుంటుండగా చిరుత పులి కనబడిందని రైతు పరుశురాం చెప్పడంతో మద్నూర్‌లో ఆందోళన నెలకొంది. మూడు రోజుల క్రితం చిరుతపులి కనిపించిందని పుకార్లు షికార్లు కావడంతో అటవీశాఖ అధికారులు అది పులి కాదు అడవి పిల్లి అని తేల్చడంతో అందరు ఊపిరిపిల్చుకున్నారు. మళ్లీ శనివారం చిరుత పులిని చూశానంటు రైతు పరశురాం భయంతో పరుగులు తీసి మద్నూర్‌లో పలువురికి చెప్పడంతో గ్రామస్తులు తండోపతండాలుగా చిరుత పులి ఉన్న ప్రదేశానికి తరలివెళ్లారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు మండల కేంద్రానికి సమీపంలోని సోనాల గ్రామానికి వెళ్లె రహదారి పక్కన చిరుత పాద ముద్రల కోసం వెతికారు. చిరుత కనిపించిందని చెబుతున్న పులికి సంబంధించిన ఆనవాళ్లు లేవని జుక్కల్ రేంజ్ ఫారెస్టు అధికారిణి సూజాత అన్నారు. చిరుత పులి గోళ్లు పోడువుగా ఉంటాయని మద్నూర్ శివారులో కనిపించిన గుర్తులు అలా లేవని ఆమె అన్నారు.మద్నూర్, సోనాల, పెద్ద శక్కర్గా గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయా గ్రామాల్లో చాటింపు వేయించాలని జీపీ సిబ్బందికి సూచించామన్నారు. మద్నూర్ శివారులో ఉన్న వ్యవసాయ భూమిలో గల రేకులషెడ్డు వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయని ఆదివారం సీసీ ఫుటేజీని పరిశీలిస్తామన్నారు.

మద్నూర్‌లో మళ్లీ చిరుత పులి అలజడి..!