
ర్యాగట్లపల్లిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు!
● నిందితులను పట్టుకున్న గ్రామస్తులు
● ఎనిమిది మందిపై కేసు నమోదు
చేసిన పోలీసులు
భిక్కనూరు: మండలంలోని ర్యాగట్లపల్లి గ్రామంలోగల బసవేశ్వరాలయం ప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న వ్యక్తులను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ర్యాగట్లపల్లి గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న అతిపురాతనమైన బసవేశ్వరాలయం ప్రాంతంలో శనివారం వేకువజామున ప్రొక్లెయిన్ సహాయంతో కొందరూ గుప్తనిధుల కోసం తవ్వకాలను ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లి పనులను అడ్డుకున్నారు. గ్రామస్తులు ప్రశ్నించగా దురుసుగా సమాధానాలు చెప్పడంతో వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితులైన ర్యాగట్లపల్లి గ్రామానికి చెందిన చిన్న భూమయ్య, మహేందర్, మంత్రి దుర్గయ్య, రామాయంపేట, భిక్కనూర్‌కు చెందిన సభావత్ భరత్, నాగభూషణం, యాదగిరి, వెంకట చంధ్రశేఖర్, నెల్లూరి కాంతారావులను అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై అంజనేయులు వివరించారు.

ర్యాగట్లపల్లిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు!