
జీజీహెచ్‌లో నవజాత శిశువు మృత్యువాత
● ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టిన బంధువులు
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అ ప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది. వై ద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని శిశువు కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. వివరాలు ఇలా.. తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడికి చెందిన అఖిల పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం సాయంత్రం కామారెడ్డి జీజీహెచ్‌కు వచ్చింది. వైద్యులు అర్ధరాత్రి ఆమెకు ప్రసవం చేశారు. ఆడపిల్ల పుట్టడంతో మహాలక్ష్మి పుట్టిందనే కుటుంబ సభ్యుల సంబరం కొద్దిసేపటికే ఆవిరైంది. మృత శిశువు జన్మించిందని వైద్యులు చెప్పారు. దీంతో బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. కాలయాపన చేయకుండా ఆపరేషన్ చేసి ఉంటే శిశువు బతికేదని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళన చేశారు. పట్టణ పోలీసులు ఆస్పత్రికి వచ్చి వారిని సముదాయించారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా వైద్యుల నిర్లక్ష్యం లేదన్నారు. ఉమ్మనీరు మింగడంతోనే శిశువు మృతి చెందిందని తెలిపారు.
పోలీసుల విధులకు ఆటంకం: కేసు నమోదు
నవీపేట: పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి శనివారం తెలిపారు. మూడు రోజుల కిందట మండల కేంద్రానికి చెందిన ఒక వర్గానికి చెందిన యువకుడు ప్రార్థనా మందిరంపై జెండాను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియలో షేర్ చేశాడు. ఇది వైరల్‌గా మారడంతో ఆగ్రహానికి గురైన మరో వర్గానికి చెందిన యువకులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేశారు. ఈక్రమంలో వారు పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారు. ఆరుగురితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.