
తెయూ సౌత్ క్యాంపస్‌లో విద్యార్థుల ధర్నా
భిక్కనూరు: అందుబాటులో అంబులెన్స్, వైద్య సిబ్బంది ఉంటే పీజీ విద్యార్థిని అశ్విని మరణించి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ వర్సిటీ సౌత్ క్యాంపస్‌లో విద్యార్థులు ధర్నా చేపట్టారు. సోమవారం ఉదయం 9 గంటలకు ప్రిన్సిపల్ కార్యాలయం ఎదుట ప్రారంభమైన ఆందోళన ఆరు గంటలపాటు కొనసాగింది. ప్రిన్సిపల్ సుధాకర్ గౌడ్‌తోపాటు పలువురు అధ్యాపకులు సముదాయించినా విద్యార్థులు శాంతించలేదు. వీసీ వచ్చే వరకు ధర్నా విరమించేది లేదని మొండికేశారు. దీంతో ప్రిన్సిపాల్ ఈ విషయాన్ని రిజిస్ట్రార్ యాదగిరి, వీసీ యాదగిరిరావుల దృష్టికి తీసుకెళ్లారు. వీసీ అందుబాటులో లేకపోవడంతో రిజిస్ట్రార్ యాదగిరి సౌత్‌క్యాంపస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సౌత్ క్యాంపస్‌లో హెల్త్‌కేర్ సెంటర్ లేకపోవడంతో కలుగుతున్న ఇబ్బందులను విద్యార్థులు రిజిస్ట్రార్‌కు వివరించారు. క్యాంపస్‌లో సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ యాదగిరి మాట్లాడుతూ వర్సిటీ లేదా సీఎస్‌ఐఆర్ నిధుల నుంచి అంబులెన్స్‌ను కొనుగోలు చేసి క్యాంపస్‌కు పంపిస్తామన్నారు. వైద్యుడు లేదా వైద్య సిబ్బంది 24 గంటలపాటు ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. విద్యార్థుల ధర్నా నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అశ్వినికి ఘన నివాళి
సౌత్ క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్న అశ్వినికి సోమవారం పలువురు ఘన నివాళులర్పించారు. మృతదేహంపై పూలమాలలు వేసి కన్నీటి పర్యంతమయ్యారు. వార్డెన్ సునీత, అధ్యాపకులు ప్రతిజ్ఞ, సరితలు అశ్విని మృతదేహం వద్ద నివాళులర్పించారు.
సమస్యల పరిష్కారానికి డిమాండ్
ఆరు గంటలపాటు కొనసాగిన నిరసన
రిజిస్ట్రార్ హామీతో ఆందోళన విరమణ

తెయూ సౌత్ క్యాంపస్‌లో విద్యార్థుల ధర్నా