
పంటలకు తెగుళ్ల బెడద
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండలంలోని కాస్లాబాద్, బేగంపూర్, వడ్లం, అంజని, కాటేపల్లి, చిన్న దేవిసింగ్ తండా, టీకారాం తండా, పోచారం గ్రామాల్లో రైతులు సాగుచేస్తున్న మొక్కజొన్న, పత్తి, సోయా, పెసర, మినుము తదితర పంటలకు తెగుళ్లు ఆశించి పంటలను నష్టపరుస్తున్నాయి. ప్రతి యేటా కొత్త రకం పురుగులు ఆశించడం వల్ల రైతాంగానికి ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదు. వ్యవసాయ అధికారులు రైతులకు పంటలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వకపోవడంతో రైతులు పురుగు మందుల దుకాణదారుల వద్దకు వెళ్లి వారు ఇచ్చిన మందులు పిచికారీ చేస్తున్నారు. ఈ మందుల వల్ల ఉపయోగం ఉండటంలేదు. ఏ మందులు వాడాలో తెలపాల్సిన వ్యవసాయ అధికారులు గ్రామాల్లో కనిపించడం లేదు. కొంత మంది రైతులు పశువులకు ఉపయోగించే గోమార్ మందును మొక్కజొన్న పంటకు పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, స్థానిక అధికారులు రైతులకు అందుబాటులో ఉండి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఏడీఏను ఫోన్‌లో సంప్రదించగా ఆయన స్పందించలేదు.
మందులు పిచికారీ చేసినా
తగ్గని తెగుళ్ల ఉధృతి
ఆందోళన చెందుతున్న అన్నదాతలు
వ్యవసాయ అధికారుల సూచనలు,
సలహాలు కరువు
మొగి పురుగు ఆశించింది
మొక్కజొన్న పంట వేశా. కాని పంటకు మొగి పురుగు ఆశించి పంట నాశనం చేస్తున్నాయి. ప్రతి యేటా కొత్త రకం పురుగులు ఆశిస్తున్నాయి. మాకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు లేకపోవడంతో దుకాణదారులు ఇచ్చిన మందులను పిచికారీ చేస్తున్నాం. వాటి ఉధృతి తగ్గడం లేదు. ఉన్నత అధికారులు స్పందించి వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
– బడదావల్ దశరథ్, రైతు, టీకారాం తండా
సూచనలివ్వాలి
ఆరుతడి పంటల సాగు చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని ఆ పంటల వైపు ఎక్కువగా మొగ్గుచుపుతాం. పంటలో ఇప్పడు ఆశించి పురుగులకు ఎన్ని మందులు కొట్టినా చావడం లేదు. ప్రతి సారి కొత్త రకం పురుగులు వస్తున్నాయి. పురుగు మందుల పిచికారీపై వ్యవసాయ అధికారులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం.
– గోతి సుప్చంద్, రైతు, టీకారాం తండా

పంటలకు తెగుళ్ల బెడద

పంటలకు తెగుళ్ల బెడద

పంటలకు తెగుళ్ల బెడద