
జైనుల కఠోర చాతుర్మాస్య దీక్ష..!
కామారెడ్డి అర్బన్: ఒకపూట అల్పాహారం లేకపోతే నకనక లాడి పోయేవారికి ఈ వార్త నమ్మలేని నిజం. జైనుల పవిత్రమైన చాతుర్మాస్య ఉపవాస దీక్షలు నాలుగు నెలల పాటు రోజు ఒక పూట భోజనం చేయడం, రాత్రి పూట అంటే సూర్యుడు అస్తమించిన నాటి నుంచి సూర్యోదయం వరకు నీళ్లు సైతం తాగకపోవడం నియామావళి. కాగా కామారెడ్డికి చెందిన ఇద్దరు జైనులు మాత్రం ఎలాంటి ఆహారం లేకుండా ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఇది ఆశ్చర్యం కల్గించే విషయమైనా.. కఠోర నిజం. 30 ఏళ్ల సుశీల్ కొఠారి అనే యువకుడు 25 రోజులుగా ఎలాంటి ఆహారం లేకుండా ఉపవాసం పాటిస్తున్నారు. అలాగే 50 సంవత్సరాలు దాటిన అర్చన బోరందియా అనే మహిళ 27 రోజులుగా ఉపవాస దీక్షలు చేస్తున్నారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కేవలం నీళ్లు మాత్రమే తీసుకుంటామని ఇరువురు సాక్షితో చెప్పారు. రాత్రి పూట నీళ్లు సైతం తీసుకోరు. కాలక్షేపం కోసం జైన మత గ్రంథం ఆగమ సూత్రాలు చదువుతుంటారు. దేవుని స్మరణలో ఉపవాస దీక్షలు సాధ్యమౌతాయని అన్నారు. దీక్షలు చేపట్టిన మూడు రోజుల వరకు కొంత ఇబ్బందిగా ఉన్న ఆధ్యాత్మిక చింతనలో ఇప్పటి వరకు ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు రాలేదన్నారు. జైనుల చాతుర్మాస్య ఉత్సవాల్లో భాగంగా ఉపవాస దీక్షలు అనేది సాధారణమైన విషయమని కామారెడ్డి జైన సంఘం ఉపాధ్యక్షుడు ప్రదీప్ కుమార్ బోరా అన్నారు. ఉపవాసంలోనూ ఆదివారం నిర్వహించిన రక్షాబంధన్ కార్యక్రమంలో సుశీల్ కోఠారి, అర్చన బోరందియా.. వారి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా పాల్గొన్నారు.
25 రోజులుగా సుశీల్ కొఠారి ఉపవాసం
27 రోజులుగా అర్చన బోరందియా..

జైనుల కఠోర చాతుర్మాస్య దీక్ష..!