
భర్తపై భార్య దాడి
● చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి
బోధన్‌రూరల్: భర్తపై భార్య దాడి చేయగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన బోధన్ మండలంలో చోటుచేసుకుంది. బోధన్ రూరల్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని మినార్‌పల్లి గ్రామానికి చెందిన దారావత్ దేశ్య నాయక్ (57) కొంతకాలంగా వ్యసనాలకు బానిసై ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరిగేవాడు. ఈ విషయంలో అతడి భార్య సాలు బాయి, కొడుకు వసంత్‌ల మధ్య తరచూ గొడవలు వస్తుండేవి. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం దేశ్యనాయక్‌పై భార్య సాలు బాయి బలమైన ఇనుప రాడుతో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో దేశ్య నాయక్ తీవ్రంగా గాయపడగా స్థానికులు, కొడుకు అతడిని చికిత్స నిమిత్తం బోధన్ జిల్లా ఆస్పత్రి తరలించగా, రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి అన్న కొడుకు గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. హత్యలో మృతుడి భార్యతోపాటు కొడుకు హస్తం కూడ ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొనగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్ రెడ్డి శనివారం తెలిపారు.