
అల్ప్రాజోలం స్మగ్లింగ్ గ్యాంగ్ అరెస్టు
బోధన్‌రూరల్: సాలూర మండల కేంద్రంలో ప్రత్యేక నిఘాతో దాడి నిర్వహించి అల్ప్రాజోలం స్మగ్లింగ్ గ్యాంగ్‌ను పట్టుకుని రూ.25లక్షల విలువల గల సరుకును స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. బోధన్ సర్కిల్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సాలూరలో అల్ప్రాజోలం స్మగ్లింగ్ చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం రావడంతో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్, ఎస్సై మచ్చేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. మహారాష్ట్రకు చెందిన అమర్‌సింగ్ దేశ్‌ముఖ్ (ఏ1), బాబురావు కడేరీ (ఏ2), షబ్బీర్ అలీ పాషామీయా చౌదరి (ఏ3), పరమేశ్వర్ బర్ధాడే (ఏ4), నిజామాబాద్ జిల్లాకు చెందిన మల్లెపూల లక్ష్మణ్‌గౌడ్ (ఏ5) గురువారం అర్ధరాత్రి కారులో రూ.25లక్షల విలువల 2.5కిలోల అల్ప్రాజోలంను రవాణా చేస్తుండగా పట్టుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి కారు, 8ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో నిందితుడు విశ్వనాథ్ శిపంకర్ (ఏ6) పరారైనట్లు తెలిపారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్, ఎస్సై మచ్చేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రూ.25లక్షల విలువగల
2.5 కిలోల సరుకు పట్టివేత
వివరాలు వెల్లడించిన
నిజామాబాద్ సీపీ సాయి చైతన్య