
భూ సేకరణ, చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలి
కామారెడ్డి క్రైం: జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద చేపట్టిన ప్యాకేజీ – 22 పనుల పురోగతి, భూసేకరణ, పరిహారం, చెల్లింపులు తదితర అంశాలపై ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పనులకు సంబంధించి భూసేకరణ కోసం ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రూ.23.15 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. భూసేకరణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ దశల్లో ఉన్న భూసేకరణ, పరిహారం చెల్లింపులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ టి శ్రీనివాస్, ఎల్లారెడ్డి ఈఈ ఎం మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.