
ఇష్టంగా చదివా.. టాపర్‌గా నిలిచా
కామారెడ్డి టౌన్: ‘‘కష్టంగా కాకుండా ఇష్టంగా చదివా. ఎస్సెస్సీలో మంచి మార్కులు సాధించా’’ అని ఎస్సెస్సీలో అత్యుత్తమ మార్కులు సాధించిన అంచిత ‘సాక్షి’తో పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా చదివితే తప్పక విజయం వరిస్తుందన్నారు. ఐఏఎస్ కావడమే లక్ష్యమని పేర్కొంది. ఎస్సెస్సీలో 596 మార్కులు సాధించిన జిల్లా కేంద్రానికి చెందిన అంచితను శుక్రవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు..
రోజూ ఉదయం 5 గంటలకే నిద్ర లేచేదాన్ని. గంటన్నరపాటు చదివా. స్కూళ్లో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విన్నా. కాన్సెప్ట్‌ను అర్థం చేసుకుని, ఏమైనా డౌట్ ఉంటే వెంటనే టీచర్స్‌ను అడిగి నివృత్తి చేసుకునేది. సాయంత్రం ఇంటికి వచ్చాక రోజంతా చెప్పిన క్లాసులను రివైజ్ చేసుకున్నాను. అన్ని పాఠ్యాంశాలలో ఏ ఒక్క ప్రశ్నను వదలకుండా ప్రాక్టీస్ చేశాను. లాంగ్వేజ్ సబ్జెక్ట్‌లు స్కోరింగ్ కోసం ఉపయోగపడ్డాయి.
ఐఏఎస్ కావడమే లక్ష్యం
ఇంటర్‌లో ఎంపీసీ తీసుకుంటా. ఇప్పటినుంచే జేఈఈకి సన్నద్ధమవుతున్నా. ఐఏఎస్ కావాలన్నదే నా లక్ష్యం. తప్పకుండా ఐఏఎస్ సాధిస్తానన్న నమ్మకం నాకుంది.
సెల్‌ఫోన్‌కు బానిసకావొద్దు..
విద్యార్థులు అన్ని సబ్జెక్ట్‌లపై శ్రద్ధ వహించాలి. పాఠాలను అర్థం చేసుకోవాలి. సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు బానిస కావొద్దు. ఇంటర్నెట్‌ను చదువుల్లో మన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వినియోగించుకోవాలి.
ఒత్తిడి లేదు..
నాన్న శశిధర్‌రెడ్డి కాంట్రాక్టర్. అమ్మ కీర్తన గృహిణి. స్కూల్‌లో ఉపాధ్యాయులు గానీ, ఇంటి వద్ద అమ్మనాన్న గానీ ఏ రోజు కూడా బాగా చదువు.. మార్కులు బాగా తెచ్చుకో అంటూ ఒత్తిడి చేయలేదు. దీంతో ప్రశాంతంగా చదవగలిగా. ప్రధానంగా పరీక్షలంటే భయపడలేదు. దీంతో పరీక్షలు బాగా రాసి, ఉత్తమ మార్కులు సాధించగలిగాను.
ప్రణాళికాబద్ధంగా చదివితే
విజయం వరిస్తుంది
మార్కుల కోసం అమ్మానాన్నలు
ఒత్తిడి చేయలేదు
‘సాక్షి’తో ఎస్సెస్సీలో అత్యుత్తమ
మార్కులు సాధించిన అంచిత