రికార్డు స్థాయిలో రక్తసేకరణ
తాడ్వాయి : అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా 135 యూనిట్ల రక్తాన్ని సేకరించడం గొప్ప విషయమని అడిషనల్ కలెక్టర్ చందర్‌నాయక్ పేర్కొన్నారు. తలసేమియా బాధిత చిన్నారుల కోసం సోమవారం తాడ్వాయి హైస్కూల్‌లో జిల్లా రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్యఫెడరేషన్, అంబేడ్కర్ సంఘాల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రక్త సేకరణలో తాడ్వాయి మండలం ఆదర్శంగా నిలిచిందన్నారు. మానవతా దృక్పథంతో రక్తదానానికి ముందుకు వచ్చిన వారిని అభినందించారు. రక్తదాతలకు ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ బాలు, రక్తదాతల సమూహం జిల్లా అధ్యక్షుడు జమీల్ మాట్లాడారు. రెండేళ్లలో కామారెడ్డి జిల్లాలో తలసేమియావ్యాధితో బాధపడుతున్న వారికోసం నాలుగు వేల యూనిట్ల రక్తం సేకరించినట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో అధిక రక్తాన్ని సేకరించిన ఘనత కామారెడ్డి జిల్లాకు దక్కిందన్నారు. దీంతో ఇండియన్ బుక్‌ఆఫ్ రికార్డులో కూడా చోటు దక్కిందన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొని యువకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో రామస్వామి, కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, సింగిల్‌విండో చైర్మన్ కపిల్ రెడ్డి, కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు భాగయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు గైని శివాజీ, నాయకులు వెంకటి, వేదప్రకాష్, వెంకటరమణ, ఎర్రం చంద్రశేఖర్, సంజీవులు, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తలసేమియా వ్యాధి బాధితుల కోసం నిర్వహించిన శిబిరానికి విశేష స్పందన
అభినందించిన అడిషనల్ కలెక్టర్
చందర్‌నాయక్


