కామారెడ్డి క్రైం: ఓటరు జాబితా విషయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు సలహాలు, సూచనలు అందజేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా, ఎన్‌రోల్‌మెంట్, మార్పులు, చేర్పులు, ఓటర్ల తొలగింపులు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజక ర్గాల పరిధిలో ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం 58,501 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని పరిశీలించి వివిధ కారణాలతో 6,310 దరఖాస్తులను తిరస్కరించామన్నారు. 51,969 దరఖాస్తులను ఆమోదించామని, 222 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. బూత్ స్థాయి ఏజెంట్‌లను నియమించుకోవాలని పార్టీల ప్రతినిధులకు సూచించారు. ఆయా బూత్‌ల పరిధిలో జరిగే విషయాలను బూత్ స్థాయి ఏజెంట్లకు తెలియజేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, తహసీల్దార్ జనార్దన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సరళ, డీటీ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్