నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): హైదరాబాద్‌లోని మయూరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పురస్కారాలకు మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన కొమ్మ దత్తు ఎంపికయ్యారు. తాండూర్ గ్రామశివారులోని శ్రీ త్రిలింగేశ్వరాలయ కమిటీ చైర్మన్ కొమ్మ దత్తుకు వివిధ రంగాలలో ఉన్న కళాప్రావీణ్యానికి గుర్తింపుగా ఉగాది పురస్కారం లభించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో దత్తుకు పలువురు ప్రముఖులు పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు టీవీ ఆర్టిస్టులు, నాట్యగురువులు తదితరులు పాల్గొన్నారు.
రసవత్తరంగా కుస్తీ పోటీలు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని కొండాపూర్ గ్రామంలో శనివారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టెంకాయ కుస్తీ నుంచి మూడు తులాల వెండి కడెం వరకు కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన కుస్తీ వీరులకు నగదు బహుమతులు అందజేశారు. చివరి కుస్తీ 3 తులాల వెండి కడెం గెలుపొందిన విజేతకు కడెం బహుకరించారు. ఈపోటీలు రసవత్తరంగా సాగాయి. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షా కేంద్రాల తనిఖీ
ఎల్లారెడ్డిరూరల్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల కేంద్రాలను ఇంటర్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం శనివారం పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 198 మంది విద్యార్థులకు గాను 192 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని చీఫ్ సూపరిండెంట్ నిజాం నోడల్ ఆఫీసర్‌కు సూచించారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడవద్దని విద్యార్థులకు సూచించారు.
ఏప్రిల్ 20 నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి 26 వరకు ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం పరీక్షలు 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతాయన్నారు.
తాండూర్‌వాసికి ఉగాది పురస్కారం