మోదీ.. మోదీ.. బీజేపీలో నయా జోష్‌..! | - | Sakshi
Sakshi News home page

మోదీ.. మోదీ.. బీజేపీలో నయా జోష్‌..!

Oct 4 2023 2:12 AM | Updated on Oct 4 2023 2:01 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఇందూరు కాషాయ వర్ణశోభితమైంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాతోపాటు నిర్మల్‌, జగిత్యాల జిల్లాలనుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు, రైతులతో నగరం జనసంద్రంలా కనిపించింది. నమో నామ జపంతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. ప్రధాని మోదీ ఇందూరు పర్యటన విజయవంతం కావడంతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం ఉరకలెత్తుతోంది.

శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని ప్రభుత్వ గిరిరాజ్‌ కళాశాల మైదానంలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ.. ఆ పార్టీకి నయా జోష్‌ తెచ్చింది. అంచనాలకు మించి జనం తరలిరావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల కోరిక అయిన పసుపు బోర్డును ప్రకటిస్తూ మోదీ ఇందూరుకు రావడంతో సభకు రైతులు భారీగా తరలివచ్చారు.

బహిరంగ సభ ప్రారంభం కాగానే రైతులు ప్రధానిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. పసుపు కొమ్ములతో చేసిన దండను ప్రధానికి వేశారు. ప్రధానమంత్రి సభాప్రాంగణంలోకి అడుగు పెట్టిన క్షణం నుంచి జనం మోదీ మోదీ అంటూ హోరెత్తించారు. సాయంత్రం 4.59 గంటలకు ప్రసంగం ప్రారంభించిన మోదీ.. 5.40 గంటల వరకు మాట్లాడారు. ప్రధాని మాట్లాడినంత సేపు ప్రజలు ఈలలు, కేకలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ గు రించి మోదీ విమర్శలు చేస్తున్న సమయంలో సభికుల నుంచి విశేష స్పందన లభించింది. ఇంతకాలం పసుపు బోర్డు అంశంపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూ వచ్చింది. పలుసార్లు ఘర్షణలు సైతం చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఊహించని రీతిలో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ప్రకటించడం, ప్రధాని మోదీ జిల్లాకు రావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉత్తర తెలంగాణపై గురి పెట్టిన బీజేపీ అందుకు ఇందూరు సభను వేదికగా చేసుకుని పోరు మొదలుపెట్టడం గమనార్హం.

మోదీ వచ్చాకే విద్యుత్‌ సమస్యకు పరిష్కారం..
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాకే విద్యుత్‌ సమస్యకు పరిష్కారం లభించిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 2014కు ముందు భారతదేశంలో విద్యుత్‌ కోతలు, పరిశ్రమలకు పవర్‌ హాలిడేస్‌ ఉండేవన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ఎక్కడా విద్యుత్‌ కొరత లేదన్నారు.

ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టిన 800 మెగావాట్ల సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును తెలంగాణ ప్రజలు, రైతులు, పారిశ్రామిక రంగానికి ప్రధాని అంకితం చేశారన్నారు. మోదీ భారత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నారన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద ఆరోగ్య రంగంలో విశేష సేవలు అందిస్తున్నారన్నారు. అనేక సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పసుపుబోర్డును సాకారం చేసి రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement