
కామారెడ్డి జిల్లా : ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీ సభను విజయవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. రెండు లక్షల మందితో బీసీ సభను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను కామారెడ్డిలో నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఆ సభకు పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యలను టీపీసీసీ ఆహ్వానించనుంది.
దీనిలో భాగంగా ఈరోజు(ఆదివారం, సెప్టెంబర్ 7వ తేదీ) కామారెడ్డిలో ముఖ్య నాయకులతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, శ్రీహరి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. దీనిలో భాగంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిందన్నారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ కామారెడ్డిలో భారీ వర్షం పడి చాలా నష్టం జరిగింది. దేశంలోని ఏ వర్గం వారు ఎంత ఉంటే అంత శాతం ఫలాలు పొందాలి. అదే నినాదంతో సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారు. అందుకే అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట అన్ని వర్గాల వారు మద్దతు తెలుపుతున్నారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డిల భరతం పట్టడానికి కామారెడ్డిలో బీసీ సభను పెడుతున్నాం. బండి సంజయ్ లేచిన మొదలు ఆలయాలు చుట్టూ తిరుగుతూ ఓట్లు అడుక్కుంటున్నారు.
బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీసీ బిల్లును సాధించుకుంటాం. 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధించుకుంటాం. బండి సంజయ్ ఒక దేశ్‌ముఖ్‌ల వ్యవహరిస్తున్నారు. బండి సంజయ్ సెక్యూరిటీ లేకుండా తిరుగు.. నేను సెక్యూరిటీ లేకుండా తిరిగేందుకు సిద్ధంగా ఉన్నా. ఈనెల 15న జరిగే సభ ద్వారా బీజేపీ దొంగ ఆట కట్టిస్తాం. అరవింద్ ఒక్కసారి అయినా బీసీల గురించి మాట్లాడలేదు. బండి సంజయ్.. బీసీ బిల్లును మోదీ కాళలు పట్టుకుని ఆమోదింపజేసే సత్తా ఉందా?, మోదీ టెక్నికల్‌గా బీసీ.. కానీ బీసీలపై ప్రేమ లేదు. ఈనెల 15వ తేదీన కామారెడ్డి సభ జనసంద్రం అవుతుంది.. అది కేంద్రం చూస్తుంది. బీసీ జీవితాలను మలుపు తిప్పే సభ కామారెడ్డిలో జరగబోతుంది’ అని పేర్కొన్నారు.