
సీసీ టీవీలో నమోదైన దుండగుల దృశ్యాలు
● ఆభరణాలు, నగదు, గుడి గంటలు చోరీ
డిచ్‌పల్లి: మండలంలోని మిట్టపల్లి, రాంపూర్ గ్రామాలలోగల ఆలయాల్లో గుర్తు తెలియని దుండగులు బీభత్సం సృష్టించారు. ఆయా ఆలయాల్లోని ఆభరణాలు, నగదును, గుడి గంటను చోరీ చేశారు. వివరాలు ఇలా.. మిట్టపల్లిలో రేణుకమాత ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి ఎల్లమ్మ విగ్రహంపై ఉన్న తాలిబొట్లు, హుండీలోని సుమారు రూ.30వేల నగదు చోరీ చేశారు. అలాగే సమీపంలోని మురళీకృష్ణ మందిరంలో రూ.లక్షన్నర నగదు, రూ.30వేల విలువగల గంటలు, ఇతర సామగ్రి ఎత్తుకెళ్లారు. అనంతరం రాంపూర్‌లోని రేణుకమాత ఎల్లమ్మ ఆలయంలో రూ. 50వేల విలువగల నగలు, గుడి గంటలు, ఇత్తడి సామగ్రి చోరీ చేశారు. హుండీలను ఎత్తుకెళ్లి సమీపంలోని పొలాల్లో వాటిని ధ్వంసం నగదులను అపహరించారు. మిట్టపల్లి ఆలయంలో చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఇద్దరు దుండగులు ముఖానికి మాస్క్‌లు ధరించి చోరీకి పాల్పడ్డారు. ఆయా గ్రామాల సర్పంచులు, వీడీసీ సభ్యుల ఫిర్యాదు మేరకు డిచ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మండలంలో వరుస చోరీలు జరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.